Siddipet Fire Accident : సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం, పలు మండలాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
21 February 2024, 23:02 IST
- Siddipet Fire Accident : సిద్దిపేట విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదంతో సిద్దిపేట సహా పలు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
Siddipet Fire Accident : పవర్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో సిద్దిపేట(Siddipet) జిల్లా కేంద్రంలోని 220/132 kv సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా భారీ మంటలు(Fire Accident) ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదంలో మంటలు భారీగా చెలరేగుతుండటంతో సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ స్టేషన్ అగ్ని ప్రమాదం సంభవించడంతో సిద్దిపేట పట్టణం అలాగే చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్ నుంచి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు(Mla Harish Rao), దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిలు ప్రమాదానికి సంబంధించిన పరిస్థితిపై విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకోవాలని అగ్నిమాపక, మునిసిపల్ అధికారులతో హరీశ్ రావు ఫోన్లో మాట్లాడి సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ ల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించారు. ఫైర్ ఇంజిన్ లతో ఆర్పేందుకు ప్రయత్నించిన మంటలు అదుపులోకి రాకపోవడంతో మంటలను ఆర్పే అగ్ని నివారణ ఫోమ్ ను ఉపయోగించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, ట్రాన్స్కో అధికారులు, సిద్దిపేటలో ఉన్న విద్యుత్ అధికారులను ఆదేశించారు.
భట్టితో మాట్లాడిన హరీశ్ రావు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ ఉన్నతధికారులతో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరణపై చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జరిగిన నష్టంపై ఇంకా అంచనాకు రాలేదని ట్రాన్స్కో అధికారులు అంటున్నారు. అయితే ఈ ప్రమాదంతో సుమారుగా రూ.20 కోట్ల నష్టం సంభవించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణం ఏంటని తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు.
నాలుగు ఫైర్ ఇంజిన్లతో నాలుగు గంటల పాటు ప్రయత్నం
హరీశ్ రావు మాట్లాడుతూ.. అగ్నిమాప శాఖ అధికారులు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్ లను ఇక్కడి పంపించడం వలన, సుమారు నాలుగు గంటల ప్రయత్నంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారన్నారు. వేరే సబ్ స్టేషన్ నుంచి త్వరలోనే కరెంటు పునరిద్ధరిస్తారని తెలిపారు. ప్రమాదానికి కారణమేంటో తెలుసుకోవడానికి విచారణ చేపట్టాలని అధికారులను కోరారు. అదృష్టవశాత్తు, సబ్ స్టేషన్లో ఉన్న చాలా ట్రాన్స్ఫార్మర్ లను కాలిపోకుండా, అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారన్నారు.
హెచ్.టి.తెలుగు రిపోర్టర్, సిద్దిపేట