Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో దారుణం, మంత్రాలు వేశాడనే నెపంతో వ్యక్తి హత్య
10 February 2024, 15:33 IST
- Siddipet Crime : మంత్రాలు నెపంతో సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తిని దారుణం హత్య చేశారు. తన కూతురు అనారోగ్యానికి కారణమయ్యాడని ప్లాన్ చేసి హత్య చేశారు.
సిద్ధిపేటలో మంత్రాలు వేశాడనే నెపంతో వ్యక్తి హత్య
Siddipet Crime : మంత్రాలు వేసి తన కూతురు అనారోగ్యానికి కారణమయ్యాడనే నెపంతో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా నుంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నుంగునూరు మండలం ఘనపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బత్తుల రజిత, తిరుపతి దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో అదే గ్రామానికి చెందిన బండి వెంకటయ్య మంత్రాలు వేయడమే దీనికి కారణమని అతడు భావించాడు. ఎలాగైనా వెంకటయ్యని చంపితేనే తన కూతురు ఆరోగ్యం బాగుపడుతుందని తిరుపతి భావించాడు. దీంతో అతన్ని చంపడానికి ప్లాన్ వేశాడు.
5 లక్షలకు ఒప్పందం
బండి వెంకటయ్యను హత్య చేసేందుకు నుంగునూరుకు చెందిన పరశురాములు, సాయిగౌడ్ తో 5 లక్షలకు తిరుపతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. డిసెంబర్ 27న అడ్వాన్సుగా యాభై వేలు, తర్వాత 10 రోజులకు మరో లక్ష ఇచ్చి వెంకటయ్యను చంపిన తర్వాత మొత్తం డబ్బులు ఇస్తానని చెప్పగా వారు అందుకు ఒప్పుకొన్నారు. ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి 3న నుంగునూరు వెళ్లిన వెంకటయ్యను పరశురాములు, సాయిగౌడ్ అనుసరించి, పనులు ముగించుకొని తిరిగి రాత్రి ఇంటికి వెళ్తుండగా ఘనపూర్ శివారులోకి రాగానే ఇద్దరు అక్కడ ఉండి గమనించి సమాచారం అందించారు. ఈ క్రమంలో పరశురాములు, సాయిగౌడ్ తో పాటు మరో ముగ్గురు సాయి, అరవింద్, రంజిత్ సహాయంతో బైక్ పై వెంకటయ్యను కొంతదూరం వెంబడించి ఢీకొట్టారు. వెంటనే కింద పడిపోయిన వెంకటయ్యను వారితో తెచ్చుకున్న తాడు, తువ్వాలును మెడకు బిగించి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని, బైక్ ను సమీపంలో ఉన్న జేసీబీ గుంటలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.
నిందితులు అరెస్ట్
వెంకటయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. వారికి ఘనపూర్ శివారులో జేసీబీ గుంటలో మృతదేహాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు చేస్తుండగా మెడకు, వీపు భాగంలో గాయాలు ఉన్నట్టు గమనించి ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు.
వాగులో స్నానానికి వెళ్లి వ్యక్తి గల్లంతు
కూడవెల్లి జాతరకు వచ్చిన ఒక వ్యక్తి వాగులో స్నానానికి వెళ్లి గల్లంతైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన మద్దెల స్వామి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మాఘ అమావాస్య సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి కూడవెల్లి జాతరకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నానం చేయడానికి వాగులోకి దిగాడు. చెక్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగులో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న యువకులు గమనించి అతనిని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
(హెచ్.టి.రిపోర్టర్, సిద్దిపేట)