Sangareddy Crime : సంగారెడ్డిలో దారుణం, ఓ వ్యక్తిని హత్య చేసి పొలంలో పడేసిన దుండగులు
30 April 2024, 15:16 IST
- Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. గొంతు కోసి, బండరాయితో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత వ్యవసాయ పొలంలో పడేశారు.
సంగారెడ్డిలో దారుణం
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య(Sangareddy Murder) చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని గొంతు కోసి, బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసి వ్యవసాయ పొలంలో పడవేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా కే శివారులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి మండలం మురుకుంజాల్ గ్రామానికి చెందిన వడ్డే సంజు (39)కు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. అతడు కుల వృత్తి అయిన వడ్డెర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గొంతు కోసి, ముఖంపై బండరాయితో కొట్టి
రెండు నెలల కిందట ఇంట్లో జరిగిన గొడవల వలన సంజు భార్య కర్ణాటక(Karnataka)లో ఉన్న తన పుట్టింట్లో ఉంటుంది. కాగా సోమవారం సాయంత్రం చాప్టా కే శివారులో గొర్రెలు మేపుతున్న వ్యక్తులు మృతదేహం ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతనిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి, ముఖంపై బండరాయితో కొట్టి (Beatent to Death)చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి చనిపోగా, తల్లి అనారోగ్యంతో మంచాన పడినట్లు తెలిపారు. సంజు సోదరులు జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వలస వెళ్లారని వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ (Narayankhed)ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో పరిశోధిస్తామని వివరించారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా అందోల్ గ్రామంలో సోమవారం జరిగింది. సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామానికి చెందిన బోయిని అశోక్, మంగ (27) భార్యాభర్తలు. అశోక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా అశోక్ చెడు వ్యసనాలకు అలవాటుపడి భార్య నగలు, విలువైన వస్తువులు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మరలా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అశోక్ భార్యను తీవ్రంగా కొట్టాడు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న మంగను కుటుంబసభ్యులు జోగిపేట(Jogipet) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. తన కుమార్తెను భర్తే హత్య చేశాడని మంగ తండ్రి బట్టయ్య ఆరోపిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అల్లుడు అశోక్ పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.