Sangareddy Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి-sangareddy fire accident sb organics reactor blast five workers spot dead few injured ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి

Sangareddy Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి

Bandaru Satyaprasad HT Telugu
Apr 03, 2024 09:03 PM IST

Sangareddy Fire Accident : సంగారెడ్డి జిల్లాలోని ఓ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

Sangareddy Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ సమీపంలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు(Reactor Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో పరిశ్రమలో మంటలు చెలరేగి(Sangareddy Fire Accident) ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఆ పరిశ్రమ డైరెక్టర్ రవి కూడా ఉన్నారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

రియాక్టర్ పేలి భారీగా మంటలు

చందాపూర్ సమీపంలో నిర్వహిస్తోన్న కెమికల్ పరిశ్రమలో ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం. రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మంటలు వేగంగా(Fire accident) వ్యాపించడంతో కార్మికులు బయటకు రాలేకపోయారని అంటున్నారు. రియాక్టర్ పేలి భవన శిథిలాలు దాదాపు ఐదు మందల మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఘటనాస్థలికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలిని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పరిశీలించారు.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్(Sangareddy Fire Accident) పరిశ్రమలో రియాక్టర్‌ పేలడం వల్ల చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.