TG Sadaram Camp : ఈనెల 11 నుంచి సదరం శిబిరాలు.. దళారులను ఆశ్రయించి మోసపోవద్దంటున్న అధికారులు
03 December 2024, 10:06 IST
- TG Sadaram Camp : దివ్యాంగులకు పింఛన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీంతో ప్రభుత్వం తరుచూ ఈ క్యాంపులు నిర్వహిస్తోంది. అర్హులైన వారికి ధ్రువపత్రాలు జారీ చేస్తోంది. అయితే.. కొందరు దళారులు సదరం సర్టిఫికెట్ల పేరుతో మోసాలు చేస్తున్నారు. వారిని నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఈనెల 11 నుంచి సదరం శిబిరాలు
దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం.. ఈనెల 11 నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కౌసల్యాదేవి ప్రకటన విడుదల చేశారు. 11న మానసిక వికలాంగులకు, 13న మూగ, చెవిటి విభాగానికి చెందిన వారికి సదరం క్యాంపు నిర్వహించనున్నారు.
ఆర్థో విభాగానికి చెందిన వారికి 18, 19, 20 తేదీల్లో ఎంజీఎం ఆసుపత్రిలో సదరం క్యాంపులు జరుగుతాయి. కంటి పరీక్షల కోసం వరంగల్ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో క్యాంపు నిర్వహించనున్నారు. దీన్ని 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ శిబిరాలకు హాజరు కావాలనుకునే వారు ముందుగా మీసేవలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
సదరం శిబిరాలకు వచ్చేవారు తమ ఎక్స్‌రే రిపోర్టులు, వైద్య ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని.. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కౌసల్యాదేవి సూచించారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని స్పష్టం చేశారు. ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పింఛన్ ఆగిపోయింది..
హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన పేర్ల సంజయ్.. పుట్టు మూగ, దివ్యాంగుడు. ఇతనికి నాలుగేళ్లుగా వికలాంగుల పింఛను ఆగిపోయింది. చచ్చుబడిన కాళ్లతో నడవలేని స్థితిలో కళ్లెదుటే కనిపిస్తున్నా.. జీవిత కాల దివ్యాంగ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడానికి అధికారులు కనికరం చూపడం లేదు. అయిదేళ్లకోసారి సదరం ధ్రువీకరణ పత్రం రెన్యూవల్ చేసుకొని వస్తేనే పింఛను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. జీవితకాల ధ్రువీకరణ పత్రం కోసం తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
దివ్యాంగుల విన్నపం..
పైడిపల్లిలో దివ్యాంగుల కోసం నిర్మించిన ఇళ్లలోకి వెళ్లేందుకు అనుమతించాలని.. కీర్తి వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ డా.సత్యశారదను కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పాలనాధికారి హామీ ఇచ్చారు.