Warangal Bank Robbery: వరంగల్ ఎస్‌బిఐలో భారీ చోరీ, 15కోట్ల విలువైన బంగారం చోరీ, బ్యాంకు నిర్లక్ష్యమే కారణం?
Warangal Bank Robbery: వరంగల్ ఎస్‌బిఐలో భారీ చోరీ జరిగింది.జిల్లాలోని రాయవర్తి మండల కేంద్రంలో ఎస్‌బిఐలో లాకర్లను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి ఖాతాదారుల ఆభరణాలను చోరీ చేశారు.ఈ దోపిడీలో రూ.15కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.గతంలో చోరీ యత్నం జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
Warangal Bank Robbery: వరంగల్ జిల్లా రాయవర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు అలారంలు ఆపేసి లాకర్లను గ్యాస్‌కట్టర్లతో కత్తిరించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.15కోట్ల విలువైన ఖాతాదారులు తనఖా ఉంచిన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐలో దుండగులు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత సినీఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. పక్కా ప్రణాళికతో కాపలా లేని బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకు దగ్గర రాత్రిపూట ఎలాంటి సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో గుర్తించిన దొంగలు తమ పని పూర్తి చేసుకుని పోయారు. బ్యాంకు అలారం తీగలను కత్తిరించి లోనికి ప్రవేశించారు.
బ్యాంకు పక్క వైపు కిటికీని తెరిచి దానికి ఉన్న ఇనుప గ్రిల్ తొలగించారు. కిటికీ నుంచి లోపలకు వెళ్లి దొంగలను గుర్తించకుండా సీసీ కెమెరాలకు ఉన్న వైర్లను తొలగించారు. బ్యాంకులో ఉన్న మూడు లాకర్లలో ఒకదానిని గ్యాస్ కట్టర్ సాయంతో కత్తిరించారు. ఒక లాకర్‌ను తెరిచి అందులో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారం ఆభరణాల ప్యాకెట్లను అపహరించారు.
గల్లంతైన 497 ప్యాకెట్లలోని దాదాపు రూ.14.94 కోట్ల విలువైన 19 కిలోల బంగారం ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాంకు నుంచి వెళ్లే ముందు సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను సైతం అపహరించారు. లాకర్ తెరిచేందుకు వినియోగించిన గ్యాస్ కట్టర్‌ను మాత్రం అక్కడే వదిలేశారు. మంగళవారం ఉదయం బ్యాంకు తెరిచిన సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. చోరీపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు శ్రావణ్‌కుమార్, రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బ్యాంకులో చోరీ జరిగిన సమాచారం తెలుసుకొని ఖాతాదారులు ఆందోళనతో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఖాతాదారులకు నష్టం జరగకుండా చూస్తామని బ్యాంకు అధికారులు వారికి సర్దిచెప్పి పంపారు.
రాయవర్తి బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అపహరణకు గురైన సొత్తు వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని వర్ధనపేట పోలీసులు చెబుతున్నారు. దోపిడీ జరిగిన రాయవర్తి బ్రాంచిని మంగళవారం రాత్రి వరంగల్ వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ పరిశీలించారు.
మరోవైపు దోపిడీ జరిగిన బ్యాంకు బ్రాంచిలో రెండేళ్ల క్రితం కూడా చోరీకి యత్నం జరిగింది. పోలీసులు సూచనతో బ్యాంకు అధికారులు ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డును నియమించారు. కొద్ది కాలానికి అతను ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది కూడా రాత్రిపూట గార్డును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. మరోవైపు బ్యాంకులో చోరీకి గురైన ఆభరణాలు రికవరీ అయ్యే వరకు ఖాతాదారులకు అందుతాయో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి.