తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu Scheme Updates : 'రైతుబంధు స్కీమ్' బిగ్ అప్డేట్ - వారి ఖాతాల్లో కూడా జమ అవుతున్న డబ్బులు

Rythu Bandhu Scheme Updates : 'రైతుబంధు స్కీమ్' బిగ్ అప్డేట్ - వారి ఖాతాల్లో కూడా జమ అవుతున్న డబ్బులు

19 January 2024, 13:49 IST

google News
    • Telangana Rythu Bandhu Scheme Updates : రైతుబంధు స్కీమ్ కు సంబంధించి తాజా అప్డేట్ అందింది. సంక్రాంతి ముందు వరకు నత్తనడకన నిధుల జమ ప్రక్రియ సాగగా... ప్రస్తుతం స్పీడ్ అందుకుంది. తాజాగా ఎకరానికి పైబడి ఉన్న రైతుల ఖాతాల్లోకి కూడా డబ్బులు జమ అవుతున్నాయి.
రైతుబంధు నిధులు జమ అప్డేట్స్
రైతుబంధు నిధులు జమ అప్డేట్స్ (https://rythubandhu.telangana.gov.in/)

రైతుబంధు నిధులు జమ అప్డేట్స్

Rythu Bandhu Scheme Updates : రైతుబంధు డబ్బుల కోసం తెలంగాణ అన్నదాతలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ నుంచి సంక్రాంతి ముందు వరకు కూడా నిధుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతూ వచ్చింది. గుంటల లెక్కన నిధుల డబ్బుల జమ ప్రక్రియ కొనసాగింది. ఇది కూడా ఎకరం లోపు ఉన్న రైతుల వరకే అందింది. అంతకుమించి భూమి ఉన్న రైతులు... రైతుబంధు డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నిధుల జమకు సంబంధించి బిగ్ అప్డేట్ అందింది. ఎకరానికి పైబడి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతున్నాయి.

ఇటీవలే రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియపై వ్యవసాయశాఖ సమీక్ష నిర్వహించింది. మంత్రి తుమ్మల అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో.. నిధుల జమ గురించి చర్చించారు. అయితే సంక్రాంతి తర్వాత నిధుల జమ ప్రక్రియ వేగవంతం చేస్తామని... ఈ నెలఖారులోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే అందుకుతగ్గట్టే... ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. మొన్నటి వరకు ఎకరంలోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు అందగా... తాజాగా ఎకరానికిపైబడిన వారి ఖాతాల్లో కూడా నిధులు జమ అయ్యాయి.

లేటెస్ట్ అప్డేట్ ఇదే....

జనవరి 18వ తేదీ నుంచి ఎకరానికి పైబడి భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేసింది రాష్ట్ర వ్యవసాయశాఖ. ఫలితంగా రెండు ఎకరాలలోపు ఉన్న రైతులకు డబ్బులు అందుతున్నాయి. తాజా పరిస్థితిపై రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలానికి చెందిన వ్యవసాయ సంబంధిత అధికారులను సంప్రదించింది హిందుస్తాన్ టైమ్స్ తెలుగు. ఎకరానికి పైబడి ఉన్న రైతులకు డబ్బులు జమ అవుతున్నాయని వారు తెలిపారు. ఈ సీజన్ ముగిసేలోపు నాటికి ప్రతి రైతు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం