తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Online Betting : ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం, డబ్బుల కోసం ట్రాక్టర్ చోరీ- నిందితులను పట్టించిన సీసీ కెమెరాలు

Online Betting : ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం, డబ్బుల కోసం ట్రాక్టర్ చోరీ- నిందితులను పట్టించిన సీసీ కెమెరాలు

HT Telugu Desk HT Telugu

14 July 2024, 14:50 IST

google News
  • Online Betting : ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడిన ముగ్గురు స్నేహితులు...డబ్బులు కోసం ట్రాక్టర్ చోరీ చేశారు. ఆ ట్రాక్టర్ ను జిల్లా దాటించి అమ్మకానికి ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు.

ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం, డబ్బుల కోసం ట్రాక్టర్ చోరీ- పట్టించిన సీసీ కెమెరాలు
ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం, డబ్బుల కోసం ట్రాక్టర్ చోరీ- పట్టించిన సీసీ కెమెరాలు

ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం, డబ్బుల కోసం ట్రాక్టర్ చోరీ- పట్టించిన సీసీ కెమెరాలు

Online Betting : ఆ ముగ్గురు ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం ట్రాక్టర్ ను చోరీ చేశారు. ట్రాక్టర్ అమ్మడానికి యత్నించి పోలీసులకు చిక్కారు. ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడే ముగ్గురితో పాటు ట్రాక్టర్ కొనుగోలు చేసిన వ్యక్తిని సైతం అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు బోయినపల్లి పోలీసులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో వేములవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు అయిన వారిని చూపించి వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన మందల సాయి, మందల వెంకటేష్, మందల వంశీ ముగ్గురు ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డారు. వ్యసనంగా మారిన బెట్టింగ్ తో డబ్బుల కోసం ఈనెల 1న రాజన్న పేటకు చెందిన ఈడుగు కనుకయ్య పొలంలో దున్నటానికి సిద్ధం చేసి పెట్టిన ట్రాక్టర్ ను గమనించిన ముగ్గురు ట్రాక్టర్ కెజివిల్స్ తొలగించి అపహరించారు. రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దు దాటించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం మొహాలా గ్రామానికి చెందిన గంజాయి పోశెట్టికి విక్రయించారు. అతడి దగ్గర అడిగిన డబ్బులు లేకపోవడంతో ట్రాక్టర్ ను లీజ్ కు ఇచ్చి కొంత డబ్బు తీసుకుని అన్ లైన్ బెట్టింగ్ తో జల్సా చేశారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా దొరికిన దొంగలు

ట్రాక్టర్ యాజమాని కనకయ్య ఫిర్యాదుతో బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్ విచారణ చేపట్టగా ట్రాక్టర్ దేహశాయిపల్లి, రత్నంపేట, గుండన్నపల్లి, కోరెం, వట్టెంల, నూకలమర్రి, నర్సింగాపూర్ మల్యాల, లింగన్నపేట మానాలా, భీమ్‌గల్ మీదుగా ఆర్మూర్ తోపాటు వివిధ గ్రామాల మీదుగా లోకేశ్వరం మండలంలోని మోహాల గ్రామానికి తరలించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ట్రాక్టర్ ను అపహరించిన ముగ్గురితో పాటు ట్రాక్టర్ కొనుగోలు చేసిన గంజాయి పోశెట్టిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వారి నుంచి జాన్ డీర్ ట్రాక్టర్, షిప్ట్ డిజైర్ కారు, ఒక బైక్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ కోసం ట్రాక్టర్ ను అపహరించి విక్రయించేందుకు యత్నించి పట్టుబడ్డారని ఎస్పీ చెప్పారు.

ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కడైనా జరిగితే సమాచారం ఇవ్వండి

ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కడైనా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహజన్ కోరారు. ప్రస్తుతం ట్రాక్టర్ చోరీకి పాల్పడ్డ ముగ్గురు ప్రొఫెషనల్ దొంగలు కాదని ఆన్లైన్ బెట్టింగ్ కోసం డబ్బులు అవసరం ఉండి అపహరించారని ఎస్పీ చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరాలకు గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని కోరారు. ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం అని ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ శ్రీనివాస్, ఎస్.ఐ పృథ్వీధర్ గౌడ్, కానిస్టేబుల్ కొటేశ్వర్, తిరుపతిలను ఎస్పీ అభినందించి నగదు రివార్డు అందజేశారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం