తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Immersion Of Ganesh : ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనంపై నిషేధం.. గ్లాస్‌లో నీళ్లు తీసుకొని తాగాలన్ని రాజాసింగ్!

Immersion of Ganesh : ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనంపై నిషేధం.. గ్లాస్‌లో నీళ్లు తీసుకొని తాగాలన్ని రాజాసింగ్!

10 September 2024, 16:03 IST

google News
    • Immersion of Ganesh : ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనంపై నిషేధం విధించారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు బీజేపీ నేత రాజాసింగ్. ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేత రాజాసింగ్
బీజేపీ నేత రాజాసింగ్

బీజేపీ నేత రాజాసింగ్

ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం నిషేధంపై ఘాటుగా స్పందించారు బీజేపీ నేత రాజాసింగ్. హుస్సేన్ సాగర్‌లో కొత్తగా కలుషితం అయ్యేది ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికే అది కలుషిత నీరు అని స్పష్టం చేశారు. ట్యాంక్ బాండ్‌లో వద్దు అంటే.. మరి ఎక్కడ నిమజ్జనం చెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే కలుషితం కదా..

'వినాయక నిమజ్జనానికి ఇంకా ఆరు రోజులే ఉంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వద్దంటే ఎలా.. హుస్సేన్ సాగర్‌లో నీరు ఇప్పటికే కలుషితంగా ఉంది. మళ్లీ కొత్తగా కలుషితం అయ్యేది ఏంటి. అసలు దీనిపై హైకోర్టులో ఎవరు పిటిషన్ వేశారు. వారిని ఒకసారి హుస్సేన్ సాగర్‌కు రమ్మని చెప్పండి. దాంట్లో గ్లాస్ నీరు తీసుకొని తాగితే.. అవి కలుషితం అయ్యాయా లేదా అనేది తెలుస్తుంది' అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

ఆదాయం వస్తలేదా..

'హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి నిమజ్జనం చేయడం మంచిదే. నిమజ్జనం తర్వాత 20 రోజుల్లో మట్టి కరిగిపోతుంది. నిమజ్జనం తర్వాత రెండు రోజులకే జీహెచ్ఎంసీ సిబ్బంది విగ్రహాలను తొలగిస్తారు. దీని వల్ల ఆదాయం కూడా వస్తుంది. విగ్రహాల స్టీల్ ద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయం వస్తుంది కదా. అలాంటప్పుడు నిమజ్జనం ఎందుకు వద్దో చెప్పాలి. అక్కడ వద్దంటే ఎక్కడ చేయాలో ముఖ్యమంత్రి చెప్పాలి' అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

ట్యాంక్‌బండ్ వద్ద బారికేడ్లు..

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ దగ్గర పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కట్టిన పోలీసులు.. హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే.. విచారణ కాకముందే హైదరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

హైకోర్టులో పిటిషన్లు..

ప్రతి సంవత్సరం గణపతి నిమజ్జన కార్యక్రమాలను హుస్సేన్ సాగర్‌లో నిర్వహిస్తారు. అయితే.. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం వేడుకలు జరపకూడదని హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వినాయకుడి విగ్రహాల నిమజ్జనంతో.. సాగర్ కాలుష్యం అవుతుందని.. దీని నుంచి చెరువులను, హుస్సేన్ సాగర్‌ను పరిరక్షించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను వేసి.. హుస్సేన్ సాగర్‌ను పూర్తిగా కలుషితం చేస్తున్నారని.. దాన్ని పరిరక్షించాలని హైకోర్టులోఅనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

తదుపరి వ్యాసం