తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Police Commissionerate : మైనర్​ బాలికపై రేప్​ అటెంప్ట్​... సీఐపై పోక్సో కేసు నమోదు

Warangal Police Commissionerate : మైనర్​ బాలికపై రేప్​ అటెంప్ట్​... సీఐపై పోక్సో కేసు నమోదు

HT Telugu Desk HT Telugu

23 March 2024, 6:16 IST

google News
    • Warangal Police Commissionerate News: మైనర్​ బాలికపై రేప్​ అటెంప్ట్​ చేశాడు ఓ సీఐ. బాధిత కుటుంబం వరంగల్ నగర పోలీసులను ఆశ్రయించగా… సీఐపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
సీఐ సంపత్ (ఫైల్ ఫొటో)
సీఐ సంపత్ (ఫైల్ ఫొటో)

సీఐ సంపత్ (ఫైల్ ఫొటో)

POCSO Case On CI in Warangal : పోలీస్​ శాఖలో సీఐగా పని చేస్తున్న అధికారి ఓ వివాహితతో సహజీవనం సాగిస్తూ.. ఆమె కూతురిపైనే కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు తాను గతంలో ఎస్సైగా పని చేసిన కాకతీయ యూనివర్సిటీ పోలీస్​ స్టేషన్​ లోనే సీఐపై కేసు నమోదు అయ్యింది. పోలీస్​ శాఖకే కలంకం తెచ్చే ఈ ఘటన వరంగల్ నగరంలో జరగగా.. మైనర్​ బాలికపై దారుణానికి యత్నించిన సీఐపై రేప్​ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు(POCSO Case On CI) నమోదు చేసి, పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో సీఐగా పని చేస్తున్న బండారు సంపత్(CI Sampath)​ దాదాపు రెండు సంవత్సరాల కిందట వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్​ స్టేషన్​ లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఇదివరకే పెళ్లి చేసుకుని ఉన్న సంపత్​.. తాను పని చేసే స్టేషన్​ పరిధిలోనే ఓ మహిళతో కొంతకాలం సహజీవనం సాగించాడు. ఇద్దరి మధ్య వ్యవహారం కొంతకాలం వ్యవహారం సజరావుగానే సాగగా.. ఆ తరువాత ఆయన అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాడు. ఆ తరువాత సీఐగా ప్రమోషన్​ పొంది కొద్దిరోజుల కిందటే భూపాలపల్లి జిల్లాకు ట్రాన్స్​ ఫర్​ అయి అక్కడే పని చేస్తున్నాడు.

మైనర్​ బాలికపై అత్యాచారయత్నం

సీఐ సంపత్​ తాను అక్రమ సంబంధం కొనసాగించిన మహిళకు ఓ కూతురు ఉండగా.. ఇటీవల సంపత్​ వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ బాలిక మాత్రమే ఉండటంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరూ లేకపోవడంతో ఆమెను రేప్​ చేయబోయాడు. దీంతో ఆయన నుంచి తప్పించుకున్న సదరు బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పుకొంది. అనంతరం ఆ మహిళ సీఐ సంపత్​ ను నిలదీయడంతో ఆయన తిరిగి వారినే బెదిరింపులకు గురి చేశారు. తన పోలీస్​ బలంతో ఇబ్బందులకు గురి చేస్తానంటూ వార్నింగ్​ కూడా ఇచ్చారు. దీంతో భయపడి పోయిన తల్లీకూతుల్లిద్దరు రెండ్రోజుల కిందట కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ సంపత్​ పై అత్యాచార యత్నంతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సంజీవ్​ వివరించారు. కాగా శుక్రవారం సాయంత్రం నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్​ కు తరలించారు.

గతంలోనూ మహిళలపై అసభ్య ప్రవర్తన!

కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా పని చేస్తున్న సమయంలో కూడా బండారు సంపత్​ పై వివిధ ఆరోపణలు వచ్చాయి. స్టేషన్​ కు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆయన కేయూ ఎస్సైగా ఉన్న సయమంలో రామారం సమీపంలోని ఎస్​వీఎస్​ కాలేజీలో ఓ ఎగ్జామ్​ రాయడానికి వచ్చిన మహిళా అభ్యర్థిపైనా సంపత్​ దురుసుగా ప్రవర్తించాడు. తన సోదరుడితో కలిసి పరీక్ష రాసేందుకు వచ్చిన ఆమెను ఎస్సై సంపత్​ అడ్డుకున్నారు. అనంతరం వారితో వాదనకు దిగి, యువతి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలం ఉపయోగించడంతో పాటు ఆమె సోదరుడిపైనా చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో వీడియో తీసిన బాధితులు దానిని సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్​ అయ్యింది. ఈ ఘటన అనంతరం బాధితులు పోలీస్​ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా అప్పుడున్న సీఐ, ఇతర అధికారులు ఎస్సై సంపత్​ కే మద్దతు ఇచ్చి, ఉన్నతాధికారుల నుంచి యాక్షన్​ లేకుండా చేశారనే ఆరోపణలున్నాయి.

సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారిపైనైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కాకతీయ యూనివర్సిటీ సీఐ సంజీవ్​ స్పష్టం చేశారు. సీఐ సంపత్​ కుమార్​ విషయంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. పోలీస్​ అధికారులైనా, ఏ డిపార్ట్ మెంట్​ కు చెందిన వ్యక్తులైనా ఇలాంటి దారుణాలకు ఒడిగడితే పక్షపాతం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం