Kakatiya University K - HUB : రూ. 50 కోట్లతో 'కె–హబ్ ' - ఇకపై రీసెర్చ్ లన్నీ కాకతీయ యూనివర్సిటీలోనే
Warangal Kakatiya University : కాకతీయ వర్శిటీలో రూ.50 కోట్లతో ఏర్పాటైన కె–హబ్ ను ఇవాళ మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ సెంటర్ ఓపెనింగ్ తో ఇకపై రీసెర్చ్ లన్నీ కాకతీయ యూనివర్సిటీలోనే జరగనున్నాయి.
K-Hub in Kakatiya University: రాష్ట్రంలో ఉస్మానియా తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పరిశోధనల వైపు నడిపించేందుకు అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్లతో కాకతీయ యూనివర్సిటీకి కె–హబ్(K-Hub in Kakatiya University) మంజూరు చేయగా.. దాని పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో ఇవాళ (ఆదివారం) రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్థానిక ప్రజాప్రతినిధులు దానిని ప్రారంభించనున్నారు. దాదాపు మూడేళ్ల పాటు కె హబ్ పనులు కొనసాగగా.. చివరకు ప్రారంభోత్సవానికి రెడీ కావడంతో పరిశోధక విద్యార్థులతో పాటు వర్సిటీ అధికారులు, అధ్యాపకుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.
రూ.50 కోట్లతో ఏర్పాటు
కాకతీయ యూనివర్సిటీకి( Kakatiya University) రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) కింద కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట కె–హబ్ మంజూరు చేసింది. పరిశోధనలకు అనువుగా బిల్డింగ్ తో పాటు ఇన్ ఫ్ట్రాస్ట్రక్షర్, ల్యాబ్స్ డెవలప్ మెంట్, ఇతర అన్ని రకాల వసతులు కల్పించేందుకు రూ.50 కోట్లు కూడా కేటాయించింది. ఇందులో మొదటి విడత పనుల్లో భాగంగా మూడు అంతస్తుల్లో బిల్డింగ్ నిర్మాణ పనుల కోసం రూ. 6 కోట్లు రిలీజ్ చేసింది. ఇదిలాఉంటే కె–హబ్ పనులకు 2020 లోనే అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ లభించగా.. కరోనా లాక్ డౌన్ వల్ల పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. టీఎస్ఈ డబ్ల్యూఐడీసీ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో టెండర్లు పిలవగా.. ఓ ప్రైవేటు సంస్థ పనులు దక్కించుకుంది. ఆ తరువాత 2021 లో పనులు ప్రారంభం కాగా.. ఆఫీసర్ల పర్యవేక్షణ లేక పనులు నత్తనడకన సాగాయి.
రీసెర్చులన్నీ ఇందులోనే..
కే హబ్ లో(K-Hub in Kakatiya University) విద్యార్థులు పరిశోధనలు కొనసాగించేందుకు అనువుగా వివిధ రకాల ల్యాబొరేటరీలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ప్రధానంగా సెంటర్ ఫర్ ప్లాంట్ జీనోమ్ ఎడిటింగ్, సెంటర్ ఫర్ ఇండిజీనియస్ కల్చర్స్, సెంటర్ ఫర్ జియోలాజికల్ సైన్స్ అండ్ మైనింగ్, సెంటర్ ఫర్ డ్రగ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, సెంటర్ ఫర్ మాలిక్యూలర్ బయోలజీ అండ్ మైక్రోబయాల్ టెక్నాలజీ తదితర ల్యాబులతో పాటు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఆయా డిపార్ట్మెంట్లలో ఉన్నతమైన పరిశోధనలు జరిగే అవకాశం ఉంటుంది.
మంత్రుల చేతుల మీదుగా ఓపెనింగ్
పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కే హబ్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధం కాగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులు దానిని ఓపెనింగ్ చేయనున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి రానున్న మంత్రులు ముందుగా కాకతీయ యూనివర్సిటీకి వస్తారు. అక్కడ రూసా ఫండ్స్ తో నిర్మించిన కె హబ్ ను ప్రారంభిస్తారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీకి సరైన రక్షణ లేకపోవడంతో భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో క్యాంపస్ చుట్టూ కాంపౌండ్ నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తారు. వర్సిటీకి రెండేళ్ల కిందట రూ.3 కోట్ల పీవీ నాలెడ్జ్ సెంటర్ మంజూరు కాగా.. దానిని ప్రారంభించనున్నారు. ఇంకా క్యాంపస్ లో హాస్టళ్ల సమస్య వేధిస్తున్న నేపథ్యంలో అమ్మాయిలకు ఒక హాస్టల్, అబ్బాయిలకు ఒక హాస్టల్ తో పాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా మరో హాస్టల్ నిర్మించేందుకు భూమి పూజ కూడా చేయనున్నారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.