TG Job Notification 2024 : మరో 1690 పోస్టుల భర్తీకి కసరత్తు.. నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవే!
18 October 2024, 9:33 IST
- TG Job Notification 2024 : తెలంగాణలోని ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. దాదాపు 1700 పోస్టులు భర్తీ చేసేందకు అధికారులు సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి తర్వలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
1690 పోస్టుల భర్తీకి కసరత్తు
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో 1690 వైద్యుల పోస్టుల భర్తీకి ఆ శాఖ కసరత్తు చేస్తోంది. వైద్య విధానపరిషత్‌లో కీలకమైన ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉంది. దీంతో భర్తీకి ఆర్థికశాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలో.. 1690 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది.
వచ్చే నెల నవంబర్‍లో నోటిఫికేషన్ ఇచ్చి.. మార్చి లేదా ఏప్రిల్ నాటికి పోస్టులు భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల ద్వారా ఎంపికయ్యే వైద్యులు అందుబాటులోకి వచ్చేవరకు.. కాంట్రాక్ట్ డాక్టర్ల నియామకానికి ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించారు. అనుమతి వస్తే.. తొలుత కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.
రేపటి వరకు ఛాన్స్..
నర్సింగ్ ఆఫీసర్ల (స్టాఫ్) ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 14వ తేదీతో గడువు ముగియటంతో వైద్యారోగ్యశాఖ సమయాన్ని పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 5 లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ముందుగా 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా.. ఇటీవలే మరో 272 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను కూడా ప్రభుత్వం జత చేసింది.
ఈ కొత్త పోస్టులు కలిపి మొత్తం 2,322 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే.. అక్టోబర్ 21, 22 తేదీల్లో ఎడిట్ చేసుకోవాలని ప్రకటనలో అధికారులు సూచించారు. అర్హులైన అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చు.
చివరి విడత కౌన్సెలింగ్..
ఇటు తెలంగాణలోని డెంటల్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన ఎండీఎస్ సీట్ల భర్తీకి చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు.. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ సీట్లకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలలోపు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వాటి ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నట్టు అధికారులు వివరించారు.