Sangareddy District News : అమానవీయం... పసికందును రాళ్లకుప్పల్లో పడేసిన తల్లి - అసలు విషయం ఇదే..!
15 February 2024, 16:55 IST
- Sangareddy District Crime News: సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డ రాళ్ల కుప్పలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డిలో అమానవీయ ఘటన
Sangareddy district News: సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును ఓ తల్లి గోనె సంచిలో మూటకట్టి రాళ్లకుప్పల్లో పడేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఓ మహిళకు పది సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఆమె భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా తల్లితో ఉంటుంది. దీంతో బుధవారం తన ఇంట్లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందును తీసుకొనివెళ్ళి శ్మశాన వాటిక పక్కనున్న రాళ్లకుప్పలో మూటకట్టి పడేసింది. అటుగా వెళ్తున్న స్థానికులకు శిశువు ఏడుపు వినబడడంతో చుట్టూ పరిశీలించారు. రాళ్లకుప్పల మధ్యలో ఉన్న పసికందును గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొందరు స్థానిక మహిళలు,అంగన్వాడీ టీచర్,ఆశా వర్కర్లు,అధికారులు అక్కడికి చేరుకొని శిశువుని బయటకు తీసి స్థానిక ఆరోగ్య ఉపకేంద్రానికి తరలించి ప్రధమ చికిత్స చేయించారు. అనంతరం సంగారెడ్డి లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అంగన్వాడీ టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పుల్కల్ ఎస్ఐ తెలిపారు. ఆ మహిళ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం కారణంగా ఈ పసికందుకు జన్మనిచ్చిందని, ఆ విషయాన్ని బయటకు చెప్పలేక బిడ్డను వదిలించుకోవటానికే ఇలా చేసిందని గ్రామస్థులు ఆరోపించారు.
మంత్రి పరామర్శ….
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశం మైలారం పారిశ్రామిక వాడలో మంగళవారం రాత్రి సిఎమ్ హెచ్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని పటాన్చెరు లోని ధ్రువ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనను తెలుసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ పటాన్చెరులోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సిఎంహెచ్ పరిశ్రమలో జరిగిన ఘటనలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
కార్మికుల ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైన వైద్య చికిత్సలను అందించాలని వైద్యులకు సూచించారు. అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరమన్నారు. కంపెనీలోని ప్రతి కార్మికున్ని కాపాడుకునే బాధ్యత కంపెనీ యాజమాన్యంపై ఉందని అన్నారు. కంపెనీ యాజమాన్యం సంపూర్ణంగా సహకరించాలని సూచించారు. ప్రభుత్వం తమ వంతు బాధ్యత నెరవేరుస్తుందన్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, ఇప్పటికే జిల్లా కలెక్టర్ నివేదికను సీఎంకు అందజేయడం జరిగిందని తెలిపారు. సమగ్ర నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ కు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నఆలోచనతో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి.
టాపిక్