Operation Smile : సంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ స్మైల్, 66 మంది బాల కార్మికులకు విముక్తి
Operation Smile : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. ఈ ఏడాది ఆపరేషన్ స్మైల్ లో 66 మంది బాలబాలికలకు విముక్తి కల్పించామన్నారు. బాల కార్మికులను పనిస్థలాల నుంచి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామన్నారు.
Operation Smile : ఆపరేషన్ స్మైల్-Xలో భాగంగా బాలలను కార్మికులుగా పెట్టుకున్న యజమానులపై 27 కేసులను నమోదు చేసి, 55 మంది బాలలకు, 11 మంది బాలికలకు మొత్తం 66 మందికి, బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించామని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. గత నెల రోజులుగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్– X అని జిల్లా ఎస్పీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటని, కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారన్నారు. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లేనని ఆయన అన్నారు. బాలలు కార్మికులుగా మారడానికి ముఖ్య కారణం పిల్లలు అనాథలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలవల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారన్నారు.
బతుకు బండిని లాగుతూ
కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నారని, చిట్టి, చిట్టి చేతులతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారని ఎస్పీ రూపేష్ అన్నారు. బాలలు పనిచేసే చోట సరైన సమయానికి తిండి దొరకక పస్తులు ఉంటూ రోగాలపాలవుతున్నారన్నారు. బాల్యం ఎంతో అందమైనదని అలాంటి బాల్యం వారికి జీవితాంతం మానని గాయం చేస్తోందన్నారు. ఏ దేశంలో నైతే బాల కార్మికులు లేని, ఆరోగ్యవంతమైన బాలలుంటారో ఆ దేశం అభివృద్ధిలో ముందుంటుందని ఎస్పీ రూపేష్ అన్నారు. బాలకార్మిక రక్కసి కబంధ హస్తాల నుంచి చిన్నారులకు విముక్తి కల్పించే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే పేర్లతో బృహత్తర కార్యక్రమాలను 2014 నుంచి ప్రతి ఏటా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్‌ను, జులై నెలలో ముస్కాన్ కార్యక్రమాన్ని వివిధ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తోందిని ఎస్పీ తెలిపారు.
ఉపాధి దొరకని కారణంగా
పోటీతత్వంతో నిండిన ప్రస్తుత సమాజంలో అన్ని రంగాలలో రాణించాలంటే విద్యతో పాటు సరైన పౌష్టిక ఆహారం, ఆటలలో రాణించడం, తోటి విద్యార్థులతో పోటీపడేతత్వం తప్పనిసరి అని ఎస్పీ రూపేష్ అన్నారు. కానీ బాల కార్మికులుగా నిలిచిపోవడం వలన పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, నైపుణ్యలేమి, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం కారణాల వలనే బాల నేరస్థులుగా మిగిలిపోతున్నారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలన్నారు. కానీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని.. బాలకార్మిక వ్యవస్థ, చిట్టి చేతులను చిత్ర హింసలు పెడుతోందన్నారు.
పిల్లలను వెట్టిచాకిరికి గురి చేసినట్లయితే క్రిమినల్ కేసులు
బాల కార్మికులను పనిస్థలాల నుంచి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని, మిస్సింగ్ కేసులను ఛేదించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తూ బాధిత చిన్నారులకు బాసటగా నిలుస్తున్నామని ఎస్పీ రూపేష్ అన్నారు. బాలకార్మికులు ఎవరైనా మీ కంట పడినా, ఎక్కడైనా పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నా నేరుగా 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలను ఎవరైనా వెట్టిచాకిరికి గురి చేసిన, బలవంతంగా బిక్షాటన చేయించిన, పశువుల కాపరులుగా, కిరాణం దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్ లు ఇతర ప్రదేశాలలోనూ పని చేయించడం, చట్టరీత్యా నేరం, ఎవరైనా పై చర్యలకు పాల్పడితే అట్టి వ్యక్తులపై చట్టరిత్య క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
సంబంధిత కథనం