తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cabinet Expansion : మంత్రి వర్గంలో బెర్తు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు, ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో హాట్ టాపిక్

TG Cabinet Expansion : మంత్రి వర్గంలో బెర్తు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు, ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో హాట్ టాపిక్

HT Telugu Desk HT Telugu

23 September 2024, 21:56 IST

google News
    • TG Cabinet Expansion : దసరా పండుగలోపు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని సమాచారం. దీంతో నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కగా...ఈసారి ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని ఆసక్తిగా మారింది. 
మంత్రి వర్గంలో బెర్తు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు, ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో హాట్ టాపిక్
మంత్రి వర్గంలో బెర్తు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు, ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో హాట్ టాపిక్

మంత్రి వర్గంలో బెర్తు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు, ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో హాట్ టాపిక్

TG Cabinet Expansion : ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. దసరా పండుగలోపే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇప్పటికే జిల్లా నుంచి సాగునీటి శాఖ మంత్రిగా ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్ నగర్ ) , ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా కోమటిరెడ్డి (నల్గొండ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ మంత్రి వర్గంలో చోటుకోసం కాచుక్కూర్చున్న వారిలో ప్రథముడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా మరికొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

అయిదుగురు ఎమ్మెల్యేల ప్రయత్నాలు

ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2023 జరిగిన ఎన్నికల్లో 11 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఒక్క సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ నెగ్గింది. కాగా, పదకొండు మంది ఎమ్మెల్యేలకు గాను ఇప్పటికే ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. అంటే ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలు మిగిలి ఉండగా, వీరిలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్ శాసనసభలో ప్రభుత్వ విప్ పదవిలో ఉన్నారు. కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి శాసన సభలో అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్ కమిటీ)కి చైర్మన్ గా ఇటీవలే నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు పొందిన వారు నలుగురు ఉన్నట్లు లెక్క.

వీరు కాకుండా ఇంకా మందుల సామేలు (తుంగతుర్తి), వేముల వీరేశం (నకిరేకల్), బత్తుల లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ), కుందూరు జైవీర్ రెడ్డి (నాగార్జున సాగర్), బాలూ నాయక్ (దేవరకొండ), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), కుంభం అనిల్ కుమార్ రెడ్డి (భువనగిరి) ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం సహా 18 మందికి అవకాశం ఉండగా, మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు గడిచిపోయాక ఆ ఆరు ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోందని, దసరా లోగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న సమాచారంతో జిల్లాలోని అయిదుగురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఎవరి సమీకరణలు వారివి

మంత్రి వర్గంలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలకు ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వెనక్కి వచ్చి తిరిగి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఇస్తామన్న హామీ మేరకే ఆయన కాంగ్రెస్ లో చేరారని ఆయన దగ్గరి అనుచర నాయకులు చెబుతున్నారు. కానీ, ఒకే కుటుంబం నుంచి ఇద్దరి మంత్రి పదవులు దక్కుతాయా అన్న ప్రశ్నలూ ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి వర్గంలో ఉన్నందున రాజగోపాల్ రెడ్డికి అవకాశం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగానే కనిపిస్తున్నా, రాజగోపాల్ రెడ్డి తనకు ఢిల్లీలో ఏఐసీసీ స్థాయిలో ఉన్న పరిచయాలతో గట్టిగానే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

ఎస్సీ (మాదిగ) కోటాలో..

రాష్ట్ర మంత్రి వర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టు విక్రమార్క ఎస్సీ వర్గానికే చెందిన వారైనా ఆయన మాల కులానికి చెందిన వారు. అదే మాదిరిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నదామోదరం రాజనర్సింహ ఎస్సీ వర్గానికే చెందిన ఆయన ఉప కులం వేరు. దీంతో ఎస్సీ మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు బీజేపీ నుంచే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి కూడా మంత్రి పదవి హామీ ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, ఆయన కూడా ఎస్సీ మాల కులానికి చెందిన వారు కావడంతో మాదిగలకే అవకాశం ఎక్కువగా ఉంటుందున్న సమీకరణల నేపథ్యంలో వేముల వీరేశం, మందుల సామేలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం

బీసీ (యాదవ) కోటాలో..

తెలంగాణలో బీసీల్లో ప్రధానమైన కులాల్లో యాదవ ఒకటి. మంత్రి వర్గంలో బీసీ (గౌడ్) లనుంచి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మరో మేజర్ క్యాస్ట్ అయిన యాదవుల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో, ప్రభుత్వ విప్ గా ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్ తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం వద్ద ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఎస్టీ ( మైదాన ప్రాంత గిరిజనులు ) కోటాలో..

మంత్రి వర్గంలో ఎస్టీ కోటాలో ఇప్పటికే ములుగు ఎమ్మెల్యే ధనసని అనసూయ అలియాస్ సీతక్క మంత్రిగా ఉన్నారు. అయితే, ఆమె ఎస్టీ ఆదివాసీ కావడంతో ఎస్టీ లంబాడ (మైదాన ప్రాంత గిరిజనులు)లకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ ఉంది. దీంతో కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న(గతంలో ఒకసారి ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన ) దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ మంత్రి పదవి ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. వీరిలో ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేలు మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికైన వారు కాగా, వీరేశం, బాలూనాయక్ రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా విజయాలు సాధించిన వారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు, ఆయన ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉన్నవారు కావడం విశేషం.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

తదుపరి వ్యాసం