Raksha Bandhan: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క.. సీఎం ఇంట్లో సందడి
19 August 2024, 11:52 IST
- Raksha Bandhan: తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండగ ఆనందోత్సాహాల మధ్య సాగుతోంది. ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఆనందంగా వెళ్తున్నారు. ఇటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ రాఖీ పండగ సందడి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు.
రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న సీతక్క
రక్షా బంధన్ సందర్భంగా.. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవంత్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కు రాఖీలు కట్టారు.
'సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు.. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని.. మనసారా కోరుకుంటున్నాను' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం..
తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండగ ఆనందోత్సాహాల మధ్య సాగుతోంది. తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు ఆనందంగా వెళ్తున్నారు. దీంతో బస్సులు రద్దీగా మారాయి. ఏ బస్ స్టేషన్ చూసినా మహిళలతో కిక్కిరిసిపోయింది. ఇటు మహిళల రద్దీకి తగ్గట్టు టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రద్దీ ఉన్న రూట్లలో ఎక్కువ సర్వీసులు నడుపుతోంది. ప్రయాణ సమయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
రద్దీగా మార్కెట్లు..
రాఖీ పండగ సందర్భంగా మార్కెట్లు రద్దీగా మారాయి. ముఖ్యంగా స్వీట్ షాపులు, రాఖీలు విక్రయించే దుకాణాలు కళకలలాడుతున్నాయి. పూల మార్కెట్లు మహిళలతో నిండిపోయాయి. అయితే.. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో.. విక్రయదారులు అమాంతం రేట్లు పెంచేశారు. వరంగల్ పూల మార్కెట్‌లో ఒక్క మూర పూల ధర వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. స్వీట్ షాపుల్లోనూ రేట్లు భారీగా పెంచేశారు. రద్దీ కారణంగా ఇటు ఆటోల ఛార్జీలు కూడా పెరిగాయని మహిళలు చెబుతున్నారు.