Warangal Police: వయసు 21.. చోరీలు 21.. ఘరానా దొంగను పట్టుకున్న వరంగల్ పోలీసులు-warangal police caught the thief who committed 21 thefts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Police: వయసు 21.. చోరీలు 21.. ఘరానా దొంగను పట్టుకున్న వరంగల్ పోలీసులు

Warangal Police: వయసు 21.. చోరీలు 21.. ఘరానా దొంగను పట్టుకున్న వరంగల్ పోలీసులు

HT Telugu Desk HT Telugu
Aug 17, 2024 06:11 PM IST

Warangal Police: చదువుకోవాల్సిన వయసులో ఆ యువకుడు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈజీ మనీ కోసం ఇళ్లు, దుకాణాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డాడు. ఇలా 21 ఏళ్ల వయసులోనే 21 దొంగతనాలు చేయగా.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి పంపించారు.

సందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
సందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

హనుమకొండ హంటర్ రోడ్డులోని దీన దయాల్ నగర్‌కు చెందిన భూతరాజు సందీప్ అనే 21 ఏళ్ల యువకుడు.. కొంతకాలం కిందట వరంగల్ నగరంలోని సాయి కేర్ హాస్పిటల్స్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేశాడు. ఈ క్రమంలోనే మద్యంతో పాటు ఇతర జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో నెలంతా రిసెప్షనిస్టుగా పని చేస్తే వచ్చే జీతం సందీప్ ఖర్చులకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు.

గతంలో 16.. ఇప్పుడు 5..

సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు చోరీలను ఎంచుకున్న సందీప్.. హైదరాబాద్ తోపాటు వరంగల్ నగరంలో తాళం వేసి ఉన్న ఇళ్లు, షాప్ లను టార్గెట్‌గా పెట్టుకున్నాడు. తన పథకంలో భాగంగా ఏడాది కిందటి వరకు 16 దొంగతనాలు చేశాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ ఏడాది జైలు నుంటి వచ్చిన సందీప్.. మళ్లీ దొంగతనాల బాటే పట్టాడు. ఇలా వరంగల్ నగరంలోని సుబేదారి పీఎస్ తోపాటు ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేశాడు. రాత్రి వేళ తిరుగుతూ.. తాళం వేసి ఉన్న షాపులను కొల్ల గొట్టి ఐదు చోరీలు చేశారు. మొత్తంగా రూ.4.5 లక్షల నగదును దొంగిలించాడు. హైదరాబాద్, హనుమకొండలో కలిపి మూడు బైకులు మూడు సెల్ ఫోన్లు దొంగలించాడు.

రెక్కీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు..

దొంగతనాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదుల మేరకు.. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మళ్లీ దొంగతనాలు చేసేందుకు సందీప్ బైక్ పై వరంగల్ సిటీలో తిరుగుతున్నట్టు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు శనివారం ఉదయం హనుమకొండ హంటర్ రోడ్డులో వెహికిల్ చెకింగ్ నిర్వహించారు. ఆ మార్గంలో వచ్చిన సందీప్.. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. గమనించిన పోలీసులు చాకచక్యంగా సందీప్‌ను పట్టుకుని విచారణ జరిపారు. దీంతో అసలు దొంగతనాల విషయాన్ని అతడు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. మొత్తంగా 21 దొంగతనాలు చేసినట్లు సందీప్ అంగీకరించడంతో అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సుబేదారి సీఐ సత్య నారాయణ రెడ్డి వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)