Medak News : విద్యార్థులను టీవీలు, ఫోన్లకు దూరంగా ఉంచండి-తల్లిదండ్రులకు కలెక్టర్ రాజర్షి షా సూచన
17 February 2024, 21:04 IST
- Medak News : పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మార్గదర్శకం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యార్థులను టీవీ, ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు.
కలెక్టర్ రాజర్షి షా
Medak News : పదో తరగతి(SSC Exams 2024)లో 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పిల్లలను మార్గదర్శకం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కోరారు. హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు, 100% ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు, విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేశారు. మంచిగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు.
విద్యార్థులను ఫోన్లు, టీవీలకు దూరంగా
విద్యార్థులను టీవీ మాధ్యమాలకు, ఫోన్లకు దూరంగా ఉంచాలని వారు సరిగ్గా చదువుకున్నారా? లేదా? అని పరిశీలించాలని నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవాలని ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలను మంచి ఫలితాలు సాధించాలని, విద్యార్థుల ప్రిపరేషన్-ప్రణాళిక గురించి వారితో ముచ్చటించారు. విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను గ్రాండ్ టెస్ట్ లను సద్వినియోగ పరుచుకోవాలని, విద్యార్థులను పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని, చదువు తప్ప వేరే ఇతర పనులు విద్యార్థులకు చెప్పకుండా ఉండాలని కలెక్టర్ తెలియజేశారు. సిలబస్, విద్యార్థుల హాజరు, A.B.C.D గ్రూపుగా విభజించిన విద్యార్థుల స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా కష్ట పడి చదివి , ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
అంగన్వాడీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
అనంతరం కలెక్టర్ రాజర్షి షా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులను ఆహారం ఎలా పెడుతున్నారు? రుచిగా ఉంటుందా?అని వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, వార్షిక పరీక్షలు(TS Inter Exams 2024) పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... అత్యంత జాగ్రత్తగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని, ఒక నిమిషం ఆలస్యం అయితే పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు.
హెచ్.టి.తెలుగు, మెదక్ రిపోర్టర్