Medak News : దళిత మహిళలు మొక్కితే వినాయకుడు మైలపడతాడా? - దళిత సంఘాలు
16 September 2024, 21:21 IST
- Medak News : గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని మొక్కడానికి వెళ్లిన దళిత మహిళలను కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని శమ్నాపూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
దళిత మహిళలు మొక్కితే వినాయకుడు మైలపడతాడా? - దళిత సంఘాలు
Medak News : వినాయకుడిని మొక్కడానికి వెళ్లిన దళిత మహిళలను కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దళిత మహిళలు వినాయకుడిని మొక్కితే దేవుడు మైలాపడతాడా అని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ సూటిగా ప్రశ్నించారు. అదివారం హవేలి ఘనపూర్ మండలం శమ్నపూర్ గ్రామాన్ని దళిత బహుజన ఫ్రంట్, మానవ హక్కుల వేదిక బృందం సందర్శించారు. వినాయకుడిని మొక్కడానికి వెళ్లిన దళిత మహిళలను కులం పేరుతో దూషించి దాడి చేసిన సంఘటనపై బాధిత దళితులను, దళితేతరులను కలిసి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
మాదిగలు వినాయకుడిని మొక్కుతారా?
ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన దళిత మహిళ కొమ్మాట భాగ్యమ్మ, ఆమె కూతురు అంజలితో కలిసి గత ఆదివారం సాయంత్రం గ్రామ పంచాయితీ వద్ద వున్న వినాయకుడిని మొక్కి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి, యాదవరెడ్డి, పట్నం చంద్రశేఖర్ లు వారిని అడ్డుకున్నారు. మాదిగలు వినాయకుడిని మొక్కుతారా? అంటూ బూతుమాటలు తిట్టి అవమానపర్చడం సిగ్గుచేటని శంకర్ మండిపడ్డాడు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు
ఈ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి ప్రశ్నించిన భాగ్యమ్మ భర్త సిద్దిరాములపై దాడి చేశారు. అడ్డుకోబోయిన భార్య భాగ్యమ్మ, కూతురు అంజలి పై దాడి చేశారన్నారు. ఈ సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు హవేలి ఘనపూర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారన్నారు. బాధితులపై అక్రమంగా బనాయించిన కౌంటర్ కేసులను ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దేవుడు, దయ్యాల పేరుతో దళితులు కాలం వృధా చేసుకోవద్దని, పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. దళిత మహిళలపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ను దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ కోరాడు. కాగా డీఎస్పీ సోమవారం గ్రామానికి వెళ్లి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు అహ్మద్, డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి హన్మకొండ దయాసాగర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రవి బాధితులు భాగ్యమ్మ, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో మరో ఘటన
దళితవాడలో ఏర్పాటుచేసిన వినాయక మండపానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ అమానుష్య ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం దాసర్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాసర్లపల్లి గ్రామంలోని దళితవాడలో యువకులు వినాయక చవితిని పురస్కరించుకొని గణేషుడిని ప్రతిష్టించి పూజిస్తున్నారు. కాగా శనివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మండపానికి నిప్పంటించి కాల్చివేశారు. దళిత సంఘాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.