Lord ganesha: ఏడో రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారా? అందుకు శుభ సమయం, ఎలా చేయాలో తెలుసుకోండి
Lord ganesha: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక విగ్రహం ప్రతిష్టించుకున్న వాళ్ళు కొందరు ఏడో రోజు నిమజ్జనం చేయాలని అనుకుంటారు. అందుకు తగిన సమయం ఏది? ఎలా నిమజ్జనం చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Lord ganesha: శ్రీ గణేష్ జన్మదినాన్ని గణేష్ చతుర్థిగా జరుపుకుంటారు. ఈ పండుగ 10 రోజుల పాటు కొనసాగుతుంది. అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. గణేష్ చతుర్థి రోజున భక్తులు గణపతి బప్పను భక్తితో ఇంటికి తీసుకువచ్చి పూజిస్తారు. దీని తరువాత వినాయకుడిని ఒకటిన్నర రోజు, మూడవ రోజు, ఏడవ రోజు లేదా అనంత చతుర్దశి నాడు ఆడంబరంగా వీడ్కోలు పలుకుతారు.
మీరు 13 సెప్టెంబర్ 2024న అంటే ఏడవ రోజున బొజ్జ గణపయ్యకు వీడ్కోలు చెప్పబోతున్నట్లయితే గణపతి నిమజ్జనం శుభ సమయం తెలుసుకోండి. ఈ సమయంలో ఆచరించాల్సిన నియమాలు ఏంటి? నిమజ్జనం ఎలా చేయాలి అనే వివరాలు తప్పనిసరిగా తెలియాలి.
నిమజ్జనానికి అనుకూలమైన సమయం
దృక్ పంచాంగ్ ప్రకారం శుక్రవారం సెప్టెంబర్ 13, 2024 నాడు గణేష్ నిమజ్జనం ఉదయం 06:04 గంటలకు ప్రారంభమై 10:43 వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:16 నుండి 01:49 వరకు మధ్యాహ్నం ముహూర్తం ఉంటుంది. దీని తర్వాత శుభ సమయం సాయంత్రం 4:54 నుండి 06:27 వరకు ఉంటుంది.
ఈ సమయాల్లో మీరు ఎప్పుడైనా వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం శుభప్రదంగా ఉంటుంది. అయితే మండపంలో నుంచి వినాయకుడిని తీసే ముందు తప్పనిసరిగా అన్నీ పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. హడావుడిగా కాకుండా ముందుగా ప్లాన్ చేసుకోవాలి.
ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి మండపం శుభ్రం చేయాలి. దేవుడి ముందు దీపం వెలిగించి ఆచారాల ప్రకారం పూజ చేయాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకం, లడ్డూలు, గరిక సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి.
సాదాసీదాగా కాకుండా మ్యూజిక్ పెట్టుకుని డప్పులు వాయించుకుంటూ డాన్స్ చేస్తూ అంగరంగ వైభవంగా వినాయకుడి ఊరేగింపు నిర్వహించాలి. నీరు ఉండే చెరువు, నది వంటి ప్రదేశాల దగ్గరకు తీసుకెళ్లాలి. ఆ తర్వాత జాగ్రత్తగా వినాయక నిమజ్జనం చేయాలి. నీటిలో విసరడం వంటివి చేయకూడదు.
ఇంట్లో ఇలా నిమజ్జనం చేయండి
ఇంట్లో ప్రతిష్టించుకున్న మట్టి విగ్రహం నిమజ్జనం చేయాలంటే మీరు సులభంగా చేసుకోవచ్చు. ఒక బకెట్ నీళ్ళు తీసుకుని అందులో మీరు విగ్రహాన్ని నిమజ్జనం చేయవచ్చు. ఆ మట్టి నీళ్ళు శుభ్రమైన ప్రదేశంలో లేదా ఏదైన మొక్కకు పోయాలి.
అనంత చతుర్దశి ముఖ్యం
వినాయకుడి విగ్రహాన్ని చాలా మంది అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు. విగ్రహాన్ని నది, చెరువు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనానికి ముందు ఆటంకాలను తొలగించే గణేశుడిని పూజించి పండ్లు, పూలు సమర్పిస్తారు. గణేష్ ఉత్సవ్ చివరి రోజును గణేష్ నిమజ్జనం అంటారు. వినాయకుని నామస్మరణలతో భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.