Vinayaka Chavithi 2024: వినాయక చవితికి గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?-what to do while bringing home the idol of vinayaka chavithi ganapati ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vinayaka Chavithi 2024: వినాయక చవితికి గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Vinayaka Chavithi 2024: వినాయక చవితికి గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Gunti Soundarya HT Telugu
Sep 06, 2024 04:00 PM IST

Vinayaka Chavithi 2024: వినాయక చవితి పండుగ రేపు జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అందరూ షాపింగ్ మొదలు పెట్టేశారు. వినాయక విగ్రహాన్ని ఇంటికి తెచ్చే ముందు మీరు ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

వినాయక చవితి 2024
వినాయక చవితి 2024

Vinayaka Chavithi 2024: భారతీయులందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. పది రోజులపాటు జరిగే పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. పార్వతీదేవి శివుడి కుమారుడైన గణేశుడికి అంకితం చేసిన పండుగ ఇది. తమ పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకోమని కోరుకుంటూ గణపతిని పూజిస్తారు.

వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి వినాయకుడు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకుంటారు. అలాగే పది రోజులు పాటు నిత్య పూజలు చేస్తారు. అయితే మీరు మీ ఇంటికి గణపతిని తీసుకువచ్చే ముందు కొన్ని చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి.

ఎలాంటి విగ్రహం కొనాలి?

విగ్రహాన్ని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తైనది కాకుండా చిన్నగా ఉన్న దాన్ని మీరు ఇంటికి తెచ్చుకోవడం మంచిది. ఇతరులతో పోల్చి చూసుకోకుండా మనకు అవసరమైనది అందమైన విగ్రహాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. మట్టితో చేసిన విగ్రహాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిది. అలాగే పర్యావరణ అనుకూల వస్తువులతో చేసిన విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి.

విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు దానిపై పగుళ్లు, విరిగిపోవడం లేకుండా చూసుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడిన విగ్రహాన్ని పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. అది చౌకగా దొరికినప్పటికీ నీటి కాలుష్యానికి కారణం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

టేబుల్ సిద్ధం చేసుకోండి

విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఎక్కడ ప్రతిష్టించుకోవాలి? ఏ సమయంలో ప్రతిష్టించాలి ముహూర్తం అన్ని సరిచూసుకోవాలి. ముందుగానే ఇంట్లో సరైన దిశను ఎంచుకొని అక్కడ ఒక టేబుల్ వేసి దానిమీద శుభ్రమైన వస్త్రాన్ని పరుచుకోవాలి. విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు వినాయకుడికి సంబంధించిన మంత్రాలను జపించాలి. లేదా గణపతి బప్పా మోరియా అని కూడా జపించవచ్చు.

ఈ సమయంలో పొరపాటున కూడా విగ్రహాన్ని నేలపై ఉంచుకోకూడదు. విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి ముందే ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్లాలి. పువ్వులు, స్వీట్లు, ధూపం, పూజ వస్తువులు విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశం దగ్గర ఉంచుకోవాలి.

రోజూ పూజ చేయాలి

విగ్రహాన్ని పూజగదికి సమీపంలో ఉంచుకోవడం ఉత్తమం. కుటుంబసభ్యులు, పొరుగు వాళ్ళు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎదురుగా గణపతి విగ్రహం కనిపించడం చాలా శ్రేయస్కరంగా భావిస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం తాజా పువ్వులతో పూజ చేయాలి. ధూపం వెలిగించాలి. మోదకం, సీట్లు సమర్పించాలి. వంటగది, షూ ర్యాక్, వాష్ రూమ్ దగ్గర చెత్త పేరుకుపోయిన ప్రదేశంలో పొరపాటున కూడా విగ్రహాన్ని ఉంచకూడదు.

తమకు అనుకూలమైన విధంగా ఐదు, ఏడు, తొమ్మిది రోజుల పాటు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. రోజువారి పూజలు క్రమం తప్పకుండా చేయాలి. పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి వినాయకుడికి పూజ చేయాలి. తాజా పువ్వుల సమర్పించి, దీపం వెలిగించి వినాయకుడికి సంబంధించిన మంత్రాలు జపించాలి. వినాయకుడు ఉండే ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. చిందరవందంగా ఉంచకూడదు. ఎండిపోయిన పువ్వులు ఎప్పటికప్పుడు తీసి శుభ్రంగా ఉంచుకోవాలి.

ఆహార నియమాలు తప్పనిసరి

చాలామంది గణేష్ చతుర్థి రోజు ఉపవాసం ఉంటారు. వినాయకుడి విగ్రహం ఇంట్లో ఉన్నన్ని రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం పొరపాటున కూడా ఇంట్లోకి తీసుకురాకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని దూరంగా ఉంచాలి. ప్రతికూల ఆలోచనలు మనసులోకి రానీయకూడదు.

విగ్రహాన్ని ప్రతిష్టించిన ఇంట్లో ఎప్పుడు తలుపులు మూసి వేయకూడదు. కుటుంబ సభ్యులు ఏదైనా సమయంలో బయటికి వెళ్లాలని అనుకుంటే కనీసం ఒకరైన కానీ ఇంట్లో ఉండాలి. తొమ్మిది రోజుల పూజ అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు తప్పనిసరిగా పూజ నిర్వహించి హారతి ఇవ్వాలి. నిమజ్జనం చేసేటప్పుడు విచారంగా ఉండకూడదు. ఎందుకంటే మరలా వచ్చే ఏడాది ఆనందం, ప్రేమ, శక్తి, ఆశీర్వాదాలను వినాయకుడు మీకు పుష్కలంగా తీసుకువస్తాడనే ఉద్దేశంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడికి వీడ్కోలు పలకాలి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.