Krishnashtami fasting rules: కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉంటున్నారా? ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోండి
Krishnashtami fasting rules: కృష్ణాష్టమి రోజు కొంతమంది ఉపవాసం ఆచరిస్తారు. ఈరోజు ఉపవాసం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు అనుసరించాలి. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
Krishnashtami fasting rules: జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా గొప్పగా, వైభవంగా జరుపుకుంటారు. ఆగస్ట్ 26వ తేదీ కృష్ణ జన్మాష్టమి వచ్చింది. ఈరోజు కృష్ణుడి బాల రూపాన్ని పూజిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధమైన ఆచారాలను అనుసరిస్తూ కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం కూడా ఉంటారు. జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండేవాళ్లు పాటించాల్సిన నియమాలు ఏంటి? చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
కృష్ణాష్టమి ఉపవాసం నియమాలు
జన్మాష్టమి వ్రతాన్ని అనుసరించాలనుకున్నవాళ్లు బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం సమయంలో పండ్లు తప్ప మరే ఇతర ఆహారం తీసుకోకూడదు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఉపవాసం విరమించాలి. కృష్ణాష్టమి రోజున భక్తులు తప్పనిసరిగా కృష్ణుడి ఆలయాన్ని సందర్శించాలి. భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. పగటిపూట నిద్రపోకూడదు.
జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండాలని అనుకునే వాళ్ళు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. కృష్ణుడి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి చేతిలో తులసి ఆకులు పట్టుకొని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి. రోజంతా రాధాకృష్ణ నామాలు అని జపిస్తూనే ఉండాలి.
ఈ పనులు చేయకూడదు
కృష్ణుడి పట్ల మీకున్న అచంచలమైన ప్రేమను తెలియజేసే విధంగా నిబద్ధతతో మీరు ఉపవాసం ఉండాలి. రోజంతా కృష్ణుడి నామాన్ని జపించాలి. తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని లడ్డూ గోపాల్ లేదా కృష్ణుడి విగ్రహానికి స్నానం చేయించాలి. అలాగే లడ్డూ గోపాల్ కు సాత్విక వస్తువులతో తయారు చేసిన నైవేద్యాలు సమర్పించాలి. మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
జన్మాష్టమి రోజు ఇంట్లో ప్రసాదం సిద్ధం చేయాలి. మఖన్ మిశ్రీ, కొత్తిమీర పంజరి, శ్రీఖండ్ వంటి పాల ఆధారత స్వీట్లు ఎక్కువగా సమర్పిస్తారు. పూజ రోజున ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించకూడదు. ఎవరిని అగౌరవ పరచకూడదు. అందరితో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించాలి. శ్రీకృష్ణుడు ఎప్పుడూ గోవుల పట్ల అమితమైన వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే వాటిపట్ల దయతో వ్యవహరించాలి. అన్ని జంతువులు పట్ల కరుణ చూపాలి. ఏ జంతువుకు హాని తలపెట్టకూడదు. జంతువులకు ఆహారం, పానీయం అందించడం వల్ల కృష్ణుడి ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది.
పూజలో ఇవి సమర్పించండి
లడ్డూ గోపాల్ ను పూజించేటప్పుడు కృష్ణుడికి ఇష్టమైన నెమలి ఈక, వేణువు, వెన్న వంటివి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. గోమాత విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు. ఇవి కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి. తమ ఇంట్లోకి చిన్ని కృష్ణుడిని ఆహ్వానిస్తూ చాలా మంది ఇంటి ముందు కన్నయ్య పాదాలు వేస్తారు. ఇంటిని అందంగా అలంకరిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.