Nidhivan lord krishna: ఇక్కడ చీకటి పడితే శ్రీకృష్ణుడు రాసలీలలు చేసేందుకు వస్తాడట
Nidhivan lord krishna: మధురలో అటువంటి మర్మమైన ప్రదేశం ఉంది. ఇప్పటికీ ఇక్కడికి శ్రీ కృష్ణుడు రాస లీలలు ప్రదర్శించడానికి వస్తాడు. ఈ రోజు వరకు సాయంత్రం తర్వాత ఎవరూ ఈ ప్రదేశంలోకి ప్రవేశించలేకపోయారని, ప్రయత్నించిన వారు పిచ్చిగా, మూగగా లేదా అంధుడిగా మారారని చెబుతారు.
Nidhivan lord krishna: శ్రీకృష్ణుని జయంతి పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ 26వ తేదీ సోమవారం నాడు అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు.
శ్రీ కృష్ణ భగవానుడికి సంబంధించి అనేక కథలు, రహస్యాలు చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. బాల్యం నుంచి కృష్ణుడు చేసిన మాయలు, యవ్వనంలో చేసిన కొంటె పనుల గురించి అందరూ చాలా ఆసక్తిగా వింటారు. భారతదేశంలో కృష్ణుడిని పూజించే అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయం మాత్రం విశేషమైనది.
ఎందుకంటే ఇక్కడికి ప్రతిరోజూ రాత్రి రాధాకృష్ణులు వచ్చి రాసలీలలు సాగిస్తారని నమ్ముతారు. ఆ ఆలయం మరెక్కడో కాదు మధురలోని నిధివన్. ఈ ఆలయమ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలను ఆకర్షించింది. నేటికీ రాధా కృష్ణుడు రాత్రుల్లో ఈ అడవికి రాస లీల ప్రదర్శనకు వస్తాడని చాలా మంది నమ్ముతారు. ఈ కారణంగా రాత్రి 7 లేదా 8 గంటల తర్వాత ఆలయ ప్రాంగణంలోకి జంతువులు, పక్షులు, మనుషులు ఎవరూ ఉండరు. నిధివన్ లోని ఆలయాన్ని సాయంత్రం ఐదు గంటలకు మూసివేస్తారు. నిధివన్‌లోని కృష్ణ లీలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఇక్కడ చెట్లు విచిత్రమే
నిధివన్ లోని ప్రతి అంశం ఆశ్చర్యం గొలిపే విధంగా ఉంటుంది. సాయంత్రం ఐదు తర్వాత నిధివన్‌లో మనుషులే కాదు జంతువులు, పక్షుల నీడ కూడా కనిపించదు. సాయంత్రం కాగానే జంతువులు ఇక్కడి నుంచి పారిపోతాయని ప్రజలు అంటున్నారు. మరో విశేషమేమిటంటే నిధివన్‌లో ఉన్న ఒక్క చెట్టు కూడా నేరుగా కనిపించదు.
సాధారణంగా చెట్ల వేర్లు భూమిలో ఉంటాయి. కానీ నిధివన్ లోని చెట్ల వేర్లు మాత్రం భూమి పైన ఉంటాయి. కొమ్మలు కూడా చిక్కుకున్నట్లు, అల్లుకున్నట్లు లేదా వంగి ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో పెరిగిన చెట్ల కొమ్మలు పైకి కాకుండా కిందకు పెరుగుతాయి. నిధివన్‌లో తులసి మొక్కలు జంటగా నాటినవి. అందుకే పొరపాటున కూడా వాటిని తుంచరు. ఎవరైనా తులసి ఆకులు కొస్తే వారికి ఏదో ఒక అనర్థం జరుగుతుందని విశ్వసిస్తారు. రాత్రి వేళ శ్రీ కృష్ణుడు, రాధా రాణి రాసలీల చేస్తున్నప్పుడు తులసి మొక్కలు గోపికలుగా మారుతాయని ప్రజలు నమ్ముతారు.
కృష్ణుడి కోసం అందమైన పూల పాన్పు
సాయంత్రం హారతి చేసే ముందు రంగ్ మహల్‌లో గంధపు మంచాన్ని అలంకరిస్తారు. సువాసన వెదజల్లే పూలతో ఈ మంచాన్ని ప్రతిరోజూ అందంగా అలంకరిస్తారు. ఈ మంచం పక్కనే వెన్న, పంచదార మిఠాయిలు ప్రసాదంగా పెడతారు. ఒక బిందె నీరు కూడా ఉంచుతారు. రాస లీల చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వస్తాడని ప్రజలు చెబుతారు. తెల్లవారుజామున రాజభవనం తలుపులు తెరుచుకుంటే మంచం ఉపయోగించినట్లు పూలు అన్నీ చెల్లాచెదురుగా పక్క నలిగిపోయి కనిపిస్తుంది. ప్రసాదం, నీళ్లు ఖాళీ అవుతాయి.
నిధివన్ వైపు ఎందుకు వెళ్లరు?
నిధివన్ నివాసితులు ఈ రాసలీలను చూసేందుకు ప్రయత్నించరు. చీకటి పడిన తర్వాత అటు అడుగు పెట్టేందుకు కూడా భయపడతారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్ళిన కొందరు మతిస్థిమితం కోల్పోయారని మూగ వారిగా అయ్యారని చెబుతారు. పిచ్చి, గుడ్డి లేదా మూగ అవుతాడని నమ్ముతారు. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తెలుసుకునేందుకు ఎవరూ సాహసించలేదు. అందుకే ఈ నిధివన్ ఇప్పటికీ మిస్టరీగా నిలిచిపోయింది. ఈ కథలన్నింటి కారణంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు నిధివన్‌ని సందర్శించడానికి వస్తారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక, మరింత సమాచారం కోసం దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.
టాపిక్