Vinakaya chavithi 2024: వినాయక వ్రత విశిష్టత ఏమిటి? ఈరోజు వినాయకుడిని ఎలా ఆరాధించాలి?
Vinakaya chavithi 2024: వినాయక చవితి విశిష్టత ఏంటి? ఈరోజు వినాయకుడిని ఎలా ఆరాధించాలి? ఏం సమర్పించాలి అనే వివరాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
Vinakaya chavithi 2024: హైందవులకు అతి ముఖ్యమైన పర్వదినం వినాయకచవితి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు . ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ అందుకునే ఇలవేల్పు గణనాథుడే అని చిలకమర్తి తెలిపారు.
సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా సకల గణాలకూ అధిపతిగా గణపతి ఆస్తికలోకం నుంచి పూజలందుకుంటున్నారు అని చిలకమర్తి తెలిపారు. గణనాథుడు ఆవిర్భవించిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా విశ్వవ్యాప్తంగా హిందువులు ఘనంగా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రులుగా వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అని చిలకమర్తి తెలియజేశారు.
గణేషుడిని ఎలా పూజించాలి?
గణేశుడు భక్త జనసులభుడు. పట్టెడు పత్రాలతో పూజిస్తే చాలు మనోభీష్టాలను నెరవేర్చగల మహనీయమూర్తి. గణేశుడికి పలు పర్యాయనామాలు ఉన్నాయి. సకల విఘ్నాలను హరించువాడు విఘ్నేశ్వరుడు. భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా గణేశ చతుర్థి అని పిలుస్తారు. ఆయనను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఆబాలగోపాలము వినాయకుడిని పూజించుకుంటారు. వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు అని అర్థం. గణేశారాధన కాలం నుంచి వస్తున్నది. దేవతలు, దేవేంద్రుడు, భగీరథుడు, ధర్మరాజు, శ్రీరాముడు మున్నగు వారెందరో వినాయకవ్రతాన్ని ఆచరించి తమ కార్యక్రమాలను దిగ్విజయం గావించుకున్నారు.
గణేశుడు భక్తజన సంరక్షకుడు. తూర్పుదిక్కున హేరంబుడు, పడమర దిక్కున వక్రతుండుడు, దక్షిణం వైపున లంబోదరుడు, ఉత్తరం వైపున గణపతి, ఈశాన్యం వైపున ఈశానందుడు, ఆగ్నేయం వైపున అగ్నితేజసుడు, నైరుతి వైపున పార్వతీసుతుడు, వాయువ్య దిక్కున వరదుడు అనే నామాలతో భక్తులను సంరక్షిస్తుంటాడు.
భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రజలు ప్రాతః కాలముననే లేచి స్నానాదికాలు పూర్తిచేసుకుని శుభ్రమైన వస్త్రాలను ధరిస్తారు. గణేశుడి పూజ కోసం ఒక మంటపం ఏర్పాటు చేస్తారు. ఆ మంటపంలో ఒక వేదికను ఏర్పాటుచేసి దాని మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద గణేశుడి ప్రతిమను ఉంచుతారు. మట్టితో చేసిన గణేశుడి ప్రతిమ చాలా శ్రేష్ఠం. మంత్రపూర్వకంగా పూజించుకుంటారు. పూజకు దుర్వాపత్రాలు అనగా గరికపోచలు, పూలు వాడతారు. గణేశుడికి 21 సంఖ్య చాలా ప్రీతికరం. కనుక ఇరవై ఒక్క పత్రాలతో గణేశుడిని పూజిస్తారు. భక్తుల మనోరథాలను సిద్ధింపజేస్తాడు కనుక ఆయనను భక్తులు సిద్ధి వినాయకుడు అని పిలుచుకుంటారని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి తెలిపారు.
వినాయకునికి కుడుములు అనగా ఉండ్రాళ్లు చాలా ఇష్టం. కావున నైవేద్యంలో ఇరవై ఒక్క కుడుములు స్వామికి సమర్పించాలి. ఐదు కుడుములు దేవుడి దగ్గర ఉంచాలి. అయిదు కుడుములను పూజ చేయించిన బ్రాహ్మణునకు ఇవ్వాలి. మిగతా కుడుములను కుటుంబ సభ్యులు తీసుకోవాలి. పూజానంతరం పూజా సామాగ్రిని బ్రాహ్మణునకు దానంగా ఇవ్వాలి. గణేశ చవితి నాడు ఆయనను ఆరాధించి, వ్రతకథను వినడం వలన దోషాలు, అపనిందలు, ఆటంకాలు మున్నగునవి తొలగిపోయి సమస్త కార్యాలు సాగిపోతాయి అని భక్తుల విశ్వాసం అని చిలకమర్తి తెలిపారు.
గణేషుడి కథ
గణేశుడి ఆవిర్భావ గాథలు పురాణాలలో పలు రకాలుగా వర్ణించబడినాయి. శివపురాణంలో కథ ఇలా ఉంది. ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి శరీరానికి నలుగుపిండిని రాసుకున్నది. మిగిలిన నలుగుపిండితో ఒక బొమ్మను తయారుచేసి ప్రాణం పోసింది. అతడిని ద్వారం దగ్గర కాపలాగా పెట్టింది. శివుడు వచ్చి లోపలికి వెళ్లబోతుండగా కాపలా ఉన్న బాలుడు అడ్డగించాడు. ఇరువురి మధ్య యుద్ధం జరిగింది. ఆగ్రహంతో శివుడు ఆ బాలుడి తలను త్రిశూలంతో నరికివేశాడు. తల తెగి పడివున్న బాలుడిని చూసి పార్వతీదేవి విలపించసాగింది.
ఆమె రోదనను చూడలేక శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని నామకరణం గావించాడు. తన కారణంగా ఆ బాలుడు వికారరూపాన్ని పొందాడని తలచి ప్రత్యామ్నాయంగా అగ్రపూజ జరుగునట్లు ఏర్పాటుచేశాడు. సమస్త దేవతలు గజాననుడిని మాలామంత్రంతో పూజించారు.
శ్లో ॥ ఓం శ్రీం హ్రీం క్లీం గణేశ్వరాయ బ్రహ్మరూపాయ చారవే సర్వసిద్ధి ప్రదేశాయ విఘ్నేశాయ నమోనమః మాలామంత్రం ముప్పై రెండు అక్షరములు గల మహామంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల సకల మనోరథములు నెరవేరుతాయి. మోక్షం ప్రాప్తిస్తుందని చిలకమర్తి తెలిపారు.