Vinakaya chavithi 2024: గణపతిని ఎలా పూజిస్తే జాతకంలోని గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందో తెలుసుకోండి
Vinakaya chavithi 2024: మీరు జాతకంలో గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వినాయక చవితి రోజు ఎలా పూజ చేస్తే ఎటువంటి దోషం నుంచి విముక్తి కలుగుతుందో తెలుసుకోండి. ఆ విధంగా పూజ చేసి జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.
Vinakaya chavithi 2024: ప్రతి వ్యక్తి జాతకరీత్యా గ్రహదోషాలను జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతకంలో గ్రహదోషం ఉంటే శుభ, ఆశుభ ఫలితాలు రెండు కలుగుతాయి. శుభ ఫలితాలు ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే అశుభ ఫలితాలు వస్తే మాత్రం దోషం నుంచి విముక్తి పొందేందుకు అనేక మార్గాలను అనుసరిస్తారు.
మీ జాతకంలో కూడా గ్రహదోషాలు ఉన్నట్లయితే ఈ వినాయక చవితికి ఈ విధంగా విఘ్నేశ్వరుడిని పూజించండి. ఇలా చేయడం వల్ల గ్రహదోష౦ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. వినాయకుడు మీ జాతకంలో ఏర్పడిన దోషాల నుంచి విముక్తి కలిగిస్తాడు. జీవితం సాఫీగా సాగిపోయేలాగా అనుగ్రహం కురిపిస్తాడు.
సూర్య దోషం
జాతకంలో సూర్య దోషం ఉండడంవల్ల వృత్తి కెరీర్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమించేందుకు మీరు ఎర్రచందనంతో చేసిన వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల దోషం తొలగిపోవడంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
చంద్రదోష నివారణ
జాతకంలో చంద్రుడు స్థానం బలహీనంగా ఉన్నట్లయితే వినాయక చవితి రోజు పాలరాయి లేదా వెండితో చేసిన వినాయకుడిని పూజించండి. ఇలా చేయడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుంది.
కుజదోషం
కుజదోషం ఉంటే వివాహంలోనూ, వైవాహిక జీవితంలోను అనేక అడ్డంకులు ఎదురవుతాయి. వాటి నుంచి బయట పడేందుకు వినాయక చవితి రోజు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే శుభ ఫలితం కలుగుతుంది. వైవాహిక జీవితంలోని అడ్డంకులను విఘ్నేశ్వరుడు తొలగించేస్తాడు.
బుధ దోష నివారణ
జాతకంలో బుధ గ్రహ దోషం వెంటాడుతున్నట్లయితే మీరు వినాయక చవితి రోజు మరకత గణపతిని ఆరాధించాలి.
గురు దోష నివారణ
గురు దోషం నుంచి బయటపడేందుకు పసుపుతో చేసిన గణపతిని పూజించాలి. అలాగే చందనం లేదా బంగారంతో చేసిన వినాయకుడిని పూజించినా విశేష ఫలితం లభిస్తుంది.
శుక్ర దోష నివారణ
జాతకంలో శుక్ర దోషం ఉన్నట్లయితే సంపద వృద్ధి తక్కువగా ఉంటుంది. ఆదాయ స్థాయిలు అనుకూలంగా ఉండకపోవచ్చు. అందువల్ల ఈ దోషాన్ని నివారించేందుకు స్పటిక గణపతిని ఆరాధన చేయాలి.
శని దోష నివారణ
జాతకంలో శని దోషం ఉన్నట్లయితే జీవితం అనేక సమస్యలతో కష్టాలతో ఉంటుంది. ఏ పని తలపెట్టిన అందులో అపజయం ఎదురవుతుంది. అందువల్ల శని దోషం పోగొట్టుకునేందుకు నల్లరాయిపై చెక్కిన వినాయకుడిని చవితి రోజు పూజించాలి.
రాహు దోష నివారణ
నీడ గ్రహమైన రాహు దోషం జాతకంలో ఉన్నట్లయితే అనేక కష్టాలు వెంటాడుతాయి. అందువల్ల ఈ దోష నివారణ కోసం మట్టితో చేసిన గణపతిని పూజించాలి.
కేతుదోష నివారణ
మరో నీడ గ్రహమైన కేతు గ్రహ దోషము జాతకంలో ఉన్నట్లయితే మీరు వినాయక చవితి రోజు తెల్ల జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఈ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే అనారోగ్య సమస్యలు తొలగించేందుకు ఎర్రచందనంతో చేసిన గణపతిని, అప్పుల బాధ పోయేందుకు పగడం గణపతిని పూజించాలి. మానసిక ప్రశాంతత కొరకు పాలరాయితో చేసిన గణపతిని, అన్ని సమస్యలు తొలగించుకునేందుకు శ్వేతార్క గణపతిని ఆరాధించాలి.
ఇది మాత్రమే కాకుండా వినాయక విగ్రహాన్ని మీరు ఇంటికి తీసుకువచ్చే గజానుడి తొండం ఏ దిశవైపు ఉంటే ఎటువంటి దోషాల నుంచి విముక్తి కలుగుతుందో తెలుసుకోవాలి. గణపతి తొండం ఎడమవైపు ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అదే కుడి వైపు తిరిగి తొండం ఉన్న విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి.
వినాయకుడి విగ్రహం తొండం మధ్యలో ఉన్నట్లయితే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. నరదృష్టి నుంచి విముక్తి కలుగుతుంది. శాంతి కోసం తెలుపు రంగు, శుభాల కోసం ఆకుపచ్చ రంగు వినాయకుడిని పూజించవచ్చు. అలాగే వెండితో చేసిన గణపతిని పూజించడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఇత్తడితో చేసిన గణపతిని పూజిస్తే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.