Medak Crime : అక్రమ సంబంధం, భూతగాదాలు-మెదక్ జిల్లా ఇద్దరు యువకులు దారుణ హత్య!
14 February 2024, 18:51 IST
- Medak Crime : మెదక్ జిల్లాలో ఒకే రోజు రెండు మర్డర్ జరిగాయి. వివాహేతర సంబంధం, భూతగాదాలతో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురైయ్యారు.
మెదక్ జిల్లా ఇద్దరు యువకులు దారుణ హత్య!
Medak Crime : మెదక్ జిల్లాలో రెండు హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకేరోజు మెదక్ జిల్లా(Medak Crime)లో వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి అనే గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉసిరికపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (27) పై, అదే గ్రామానికి చెందిన ఎరుకలి నర్సింహులు అనే వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ దాడిలో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు . ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ దారుణ హత్య
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్ జిల్లా(Medak crime) వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామానికి చెందిన తాట్కూరి నరేష్ (32) కొంతకాలంగా పోతిరెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా నరేష్ మంగళవారం విధుల్లో ఉండగా అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు అతని తల, మెడ భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం సబ్ స్టేషన్ దగ్గర నుంచి గ్రామానికి వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీస్ జాగిలాలను తెప్పించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన నరేష్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతనికి కొంతకాలంగా భూతగాదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తగాదాల కారణంగానే నరేష్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హల్దీ వాగులో ఓ మహిళా మృతదేహం లభ్యం
హల్దీ వాగులో ఓ మహిళా మృతదేహం లభించిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా(Medak Crime) తూప్రాన్ పట్టణ సమీపంలోని హల్దీ వాగుపై ఉన్న బిడ్జి వద్ద నీటిలో మహిళా మృతదేహం తేలుతూ ఉండడం గమనించిన స్థానికులు తూప్రాన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
హెచ్.టి.రిపోర్టర్, మెదక్ జిల్లా