Medak Crime : మెదక్ జిల్లాలో దారుణం, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై కత్తులతో దాడి!
Medak Crime : మెదక్ జిల్లాలో తొగుట గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా మహిళపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. డబ్బు, నగల కోసం హత్య చేశారా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.
Medak Crime : ఉమ్మడి మెదక్(Medak) జిల్లాలో ఒకేరోజు రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హత్య(Murder) చేసిన ఘటన మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంలోని తొగుట గ్రామంలో జరిగింది. తొగుట గ్రామానికి చెందిన మంద ఆశయ్యకు ఇద్దరు భార్యలు సంగమణి (50), మంజుల ఉన్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆశయ్యకు ఉన్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజు మొదటి భార్య సంగమణి బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా, రెండో భార్య మంజులతో కలిసి ఆశయ్య మరొక శుభకార్యానికి వెళ్లారు. కాగా సంగమణి ఆదివారం సాయంత్రమే ఇంటికి వచ్చింది.
గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి
ఇంట్లో ఒంటరిగా ఉన్న సంగమణిపై ఎవరో గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. కాగా శుభకార్యానికి వెళ్లిన ఆశయ్య, మంజుల దంపతులు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా సంగమణి రక్తపు మడుగులో పడి ఉండటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆశయ్య పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి మెదక్ డీఎస్పీ ఫణింద్ర, సీఐ దిలీప్ లు చేరుకొని ఆధారాలు సేకరించి విచారణ చేపడుతున్నారు . ఆశయ్య ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరుగుతుండేవని తెలిపారు. ఈ హత్యలో కుటుంబసభ్యుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను(Woman murder) డబ్బు, నగల కోసం హత్యా చేశారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు(Police) విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లాలో భూతగాదాలతో ఒకరు హత్య
భూతగాదాలతో ఒకరు హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా అందోల్ మండలం ఆల్మయిపేటలో చోటుచేసుకుంది. ఆల్మయిపేటకి చెందిన ఇస్మాయిల్, కరీం, ఖాజాపాష ముగ్గురు అన్నదమ్ములు. కాగా కరీం భార్య హయాబీ పేరిట ఆల్మయిపేట శివారులో ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం భూమిని కరీం అల్లుడైన ఖమ్రుద్దీన్ సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమి ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తి కాబట్టి తమకు వాటా ఉందని, ఇస్మాయిల్ కుమారుడు మునిరుద్ధిన్, ఖమ్రుద్దీన్ మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టిన సమస్య కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో ఖమ్రుద్దీన్ జోగిపేట పోలీస్ స్టేషన్ లో మునిరుద్ధిన్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు వారికీ నచ్చజెప్పి, ఇరు కుటుంబాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
తలపై బండరాయితో కొట్టడంతో
సోమవారం ఖమ్రుద్దీన్ కుమారుడు గఫర్ వ్యవసాయ భూమి వద్దకు వచ్చి పనులు చేయిస్తుండగా అక్కడికి మునిరుద్ధిన్ వచ్చాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో గఫర్, మునిరుద్ధిన్ పై దాడి చేయడంతో అతడు కిందపడగా తలపై బండరాయి వేయడంతో మునిరుద్ధిన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న జోగిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై అరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(హెచ్.టి.తెలుగు రిపోర్టర్, మెదక్)
సంబంధిత కథనం