Khammam Tribal Attacked Police :పోడు భూముల విషయంలో పోలీసులపై గిరిజనులు దాడి, సీఐకి తీవ్ర గాయాలు
31 March 2024, 17:21 IST
Khammam Tribal Attacked Police : ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య చెలరేగిన వివాదంలో పోలీసులపై దాడి జరిగింది. ఓ వర్గం గిరిజనులు పోలీసులపై దాడి చేశారు.
ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Khammam Tribal Attacked Police : పోడు భూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు(Tribal Fight) దారితీసింది. గిరిజనుల దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై(Tribal Attacked Police) ఓ వర్గం తిరిగబడింది. పెద్ద సంఖ్యలో గిరిజనులు పోలీసులపై దాడికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో... బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడుభూముల విషయంలో ఘర్షణ తలెత్తింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని గిరిజనుల దాడిని అడ్డుకున్నారు. అయితే గిరిజనులు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. పెద్ద సంఖ్యలో గిరిజనుల దాడికి పాల్పడడంతో సత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. గిరిజనులు కర్రలతో పోలీసులను వెంబడించి మరీ కొట్టారు. చంద్రాయపాలెంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
పోడు భూముల వివాదం ఉద్రిక్తత.. సత్తుపల్లి సీఐపై గిరిజనుల దాడి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం(Chandrayapalem) గ్రామంలో చోటుచేసుకున్న పోడు భూముల వివాదం(Podu Lands) ఉద్రిక్తతకు దారి తీసింది. గత కొంత కాలంగా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం, బుగ్గపాడు గ్రామానికి చెందిన రెండు గిరిజన తెగల మధ్య పోడు భూముల విషయంలో వివాదం చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఇరు తెగలకు చెందిన గిరిజనులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకోగా సమాచారం అందుకున్న సత్తుపల్లి సీఐ కిరణ్(Tribal attack on Police) తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. పోడు భూముల విషయంలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు సీఐ కిరణ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని వారిస్తుండగా ఆగ్రహానికి లోనైన గిరిజనులు సీఐపై సైతం కర్రలతో దాడికి తెగించారు. సీఐ కిరణ్ ను కాపాడేందుకు ప్రయత్నించిన మరో నలుగురు పోలీసులను కూడా తీవ్రంగా గాయపరిచారు. దీంతో పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన పోలీసులు ఆత్మ రక్షణలో పడ్డాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి సీఐ సహా పలువురు సిబ్బంది గిరిజనుల నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన కిరణ్ తో పాటు ఇతర పోలీసులను సత్తుపల్లిలోని హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఆ గ్రామాల మధ్య మోహరించారు. దాడికి కారణమైన 30 మంది గిరిజనులను అదుపులోకి తీసుకుని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గతంలో ఫారెస్ట్ అధికారి హత్య కలకలం
గతంలో పోడు భూముల వివాదంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్య (Forest Officer Murder)చోటు చేసుకోవడం తెలిసిందే. ఖమ్మం జిల్లా ఎర్రబోడు గ్రామంలో గిరిజన తెగలకు(Tribal) చెందిన ప్రజలు ఫారెస్టు భూమిలో(Forest Lands) వ్యవసాయం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటుతున్న వ్యక్తులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అగ్రహావేశాలకు లోనైన ఇద్దరు వ్యక్తులు ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు పై విరుచుకుపడి ఒక్కసారిగా దాడి చేశారు. వారి వద్ద ఉన్న కత్తితో శ్రీనివాసరావు గొంతు కోసి హత్య చేశారు. ఈ హఠాత్ పరిణామంతో ఆయనతో వచ్చిన ఇద్దరు సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం రాష్ట్ర వ్యాప్త సంచలనం కలిగించింది. తాజాగా పోడు భూముల వివాదంలో పోలీసులపై దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం