Podu Lands: జూన్‌ లో ‘పోడు’ పట్టాల పంపిణీ... రాతపూర్వక హామీ ఇవ్వాల్సిందేనా..?-distribution of podu land pattas from june 24 in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Podu Lands: జూన్‌ లో ‘పోడు’ పట్టాల పంపిణీ... రాతపూర్వక హామీ ఇవ్వాల్సిందేనా..?

Podu Lands: జూన్‌ లో ‘పోడు’ పట్టాల పంపిణీ... రాతపూర్వక హామీ ఇవ్వాల్సిందేనా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
May 25, 2023 08:16 AM IST

Podu Lands Issue in Telangana: పోడు పట్టాల పంపిణీకి తేదీని ఖరారు చేసింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో పోడు భూముల అంశానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా..? ఎంత మందికి పట్టాలు ఇస్తారు..? ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలను అమలు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Telangana Podu Lands Issue: పోడు భూములు... గత కొంత కాలంగా తెలంగాణలో చర్చ జరుగుతూనే ఉంది. ఏదో ఒక చోట అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇదీ కాస్త…గత కొద్దిరోజుల కిందట ఓ అధికారిని అత్యంత దారుణంగా హత్య చేసే అంతవరకు కూడా వెళ్లింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో పోడు భూముల అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీగా గిరిజనులు పోడు చేసుకుంటున్నారు. వీరికి పట్టాల అందజేత విషయంలో కూడా ప్రభుత్వం గతంలో కూడా ప్రకటనలు చేసింది. వీటికితోడు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కూడా కీలక ప్రకటనలు చేయటం… ఇటీవల జరిగిన సమీక్షలో పట్టాల పంపిణీపై నిర్ణయం తీసుకోవటంతో మరో అడుగు ముందుకు పడినట్లు అయింది. జూన్‌ 24 నుంచి 30 వరకు పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోడు భూముల అంశానికి పరిష్కారం దొరికినట్లేనా..? లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుంది..? కటాఫ్ ఎక్కడి వరకు పెడ్తారు..? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

తెలంగాణలోని సుమారు 11 జిల్లాల్లో పోడు భూములు అధికంగా ఉన్నాయి. మిగతా జిల్లాల్లోనూ పోడు వ్యవసాయం(Podu Cultivation) చేస్తున్న వారు ఉన్నారు. కొన్నేళ్లుగా గిరిజన రైతులు సాగు చేకుకుంటున్నారు. హరితహారం పథకంతో అటవీ భూముల్లో ప్రభుత్వం మెుక్కల పెంపకం చేపడుతోంది. ఫలితంగా అటవీ అధికారులు, పోడు వ్యవసాయం చేసే రైతులకు మధ్య వివాదం నడుస్తోంది. భూ హక్కు ప త్రాలు ఉన్న భూములను వదిలేసి.. మిగతా ప్రాంతాల్లో మెుక్కలు నాటుతామని అధికారులు చెబుతున్నారు. తాము పోడు చేసుకుంటున్న భూముల్లో మెుక్కలు నాటుతున్నారని గిరిజనులు అంటున్నారు. రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి రెండు వేల 845 గ్రామ పంచాయతీల నుంచి 4 లక్షల 14వేల 353 దరఖాస్తుల వరకూ ప్రభుత్వానికి వచ్చాయి. ఆ భూమి చూసుకుంటే.. 12లక్షల 46వేల 846 ఎకరాలుగా ఉంది. ఆ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కసరత్తు నడుస్తోంది. ఇదే అంశంపై అసెంబ్లీలో స్పందించిన సీఎం కేసీఆర్… 11 లక్షల ఎకరాలకుపైగా పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అడవులను నరకవద్దని… పోడు వ్యవసాయ విషయంలో రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలా చేయకపోతే పట్టాలు పంపిణీ చేయమని స్పష్టం చేశారు. అయితే తాజాగా జూన్ 24 నుంచి పట్టాల పంపిణీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో… సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి.

అసెంబ్లీలో సీఎం ఏం చెప్పారంటే..?

రాజకీయ పక్షాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు కూడా రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. దీనిపై సమగ్రంగా చర్చించి.. లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానికంగా ప్రజాప్రతినిధులు రాతపూర్వక హామీలు ఇస్తారా..? ప్రభుత్వం చెబుతున్న నిబంధనలకు గిరిజనులు ఓకే అంటారా..? అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అక్రమంగా కొందరు గిరిజనుల భూములను కొట్టేసి పోడు చేస్తున్నారు. ఇతర కులాల వారు గిరిజనుల అమ్మాయిలను వివాహం చేసుకొని కూడా పోడు భూములను ఆక్రమించారు. ఈ విషయాన్ని కూడా సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అంశంపై కూడా ప్రభుత్వం ఓ విధానంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమించిన భూముల విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా చూడాలి.

అయితే రాతపూర్వక హామీ విషయంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు ఇప్పటివరకు రాలేదు. అయితే జూన్ 24 నుంచి పట్టాల పంపిణీకి సిద్ధమవుతున్న వేళ… త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో సీఎం ప్రస్తావించిన అంశాలను పొందుపరుస్తారా..? ఎంతమందికి పట్టాలు ఇస్తారు..? అక్రమణకు గురైన భూముల విషయంలో ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం… పారదర్శకంగా ప్రక్రియను చేపట్టాలని… అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కటాఫ్ విషయంలో సరైన విధానం పాటించాలని ప్రధానంగా కోరుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం