CM KCR : జూన్ 24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ, జులై నెలలో గృహలక్ష్మి పథకం- సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు-hyderabad cm kcr key decision on tribal land distribution gruhalakshmi scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Cm Kcr Key Decision On Tribal Land Distribution Gruhalakshmi Scheme

CM KCR : జూన్ 24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ, జులై నెలలో గృహలక్ష్మి పథకం- సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

Bandaru Satyaprasad HT Telugu
May 23, 2023 09:13 PM IST

CM KCR : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ రోజు వారీ కార్యక్రమాలు, పోడు భూముల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. జులై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ రోజువారీ షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో కలిపి రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతు బంధు అందుతున్నదో వీరికి అదే పద్ధతిలో రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి కొత్తగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సీఎం తెలిపారు.

జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు.

ఇండ్ల స్థలాల పంపిణీ

ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు.

జులైలో గృహలక్ష్మి పథకం

గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరితగతిన తయారు చేయాలని, జులై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జులైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు.

నిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన :

జూన్ 14 'వైద్య ఆరోగ్య దినోత్సవం' నాడు నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

IPL_Entry_Point