KCR District Tours : కేసీఆర్ ఈజ్ బ్యాక్...! త్వరలోనే జిల్లాల పర్యటనలు
07 January 2024, 5:38 IST
- KCR District Tours : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ మళ్లీ జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎముక మార్పిడి సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్... ప్రస్తుతం కోలుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR District Tours : పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేపథ్యంలో... ఈ ఎన్నికలు అతిపెద్ద సవాల్ గా మారాయి. ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జోష్ తో ఉండగా… ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లను గెలవాలని చూస్తోంది. ఇదిలా ఉంటే… మెజార్టీ సీట్లపై కన్నేసింది బీజేపీ. రెండు జాతీయ పార్టీలు కూడా బలమైన ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలో.... బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావించింది బీఆర్ఎస్. కానీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. 39 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనుకున్న వ్యూహాలు బెడిసికొట్టడంతో... ఫలితాలపై అంచనాలు పూర్తిగా తప్పాయి. ఫలితంగా కేసీఆర్ కు అతిపెద్ద షాక్ తగిలినట్లు అయింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నా... ప్రజల తరపున కొట్లాడే పార్టీగా తాము ముందు వరుసలో ఉంటామని చెబుతోంది బీఆర్ఎస్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతోంది.
ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ప్రతిరోజూ ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించిన నేతలతో చర్చిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు.... రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కసరత్తు చేస్తోంది. నేతలు, కేడర్ అంతా కలిసి పార్టీని కాపాడుకోవాలని పిలుపునిస్తోంది. అధికార కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడుదామని చెబుతోంది. ఈ సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సమన్వయం చేస్తున్నారు.
త్వరలోనే కేసీఆర్ పర్యటనలు...
ప్రస్తుతం సన్నాహాక సమావేశాలతో నేతలను దిశానిర్దేశం చేస్తున్న బీఆర్ఎస్... త్వరలోనే క్షేత్రస్థాయిలో కూడా పలు కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే పార్టీ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్...వేగంగా కోలుకుంటున్నారని హరీశ్ రావు చెప్పారు. త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని, జిల్లాల పర్యటనలు ఉంటాయని కూడా వెల్లడించారు. హరీశ్ ప్రకటనతో... కేసీఆర్ మళ్లీ జనంలోకి రావటం ఖాయంగానే కనిపిస్తోంది.
కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఫిబ్రవరిలో ఉండొచ్చని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆలోపు పూర్తిగా కోలుకుంటారని... తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తారని హింట్ ఇస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటున్న వేళ.... కేసీఆర్ రీఎంట్రీ పార్టీలో సరికొత్త జోష్ ను నింపుతుందని భావిస్తున్నాయి…!