BRS Party : పాత పథకాల రద్దు...! నిరసనలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్-brs demanded that the state government continue the existing welfare scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Party : పాత పథకాల రద్దు...! నిరసనలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్

BRS Party : పాత పథకాల రద్దు...! నిరసనలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 06, 2024 06:10 AM IST

BRS Party On Congress Govt : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయటాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ… నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైంది.

కేటీఆర్, హరీశ్ రావు
కేటీఆర్, హరీశ్ రావు

BRS Party On Congress Govt : ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు… ప్రకటన చేశారు. ప్రజలకు లబ్ధి కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయటాన్ని ఖండిస్తూ… నిరసన కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామన్నారు.

దళిత బంధు, గొర్రెల పంపిణీ రద్దు చేయడం అంటే బలహీనవర్గాలకు, దళితులకు తీరని ద్రోహం చేసినట్లే అని కేటీఆర్, హరీశ్ రావు అన్నారు. పట్టణాలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నదని విమర్శించారు. శుక్రవారం పార్టీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జిలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడారు.

“కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతోంది. గత పది సంవత్సరాలలో లక్షలాదిమందికి ఉపయోగపడి, వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉన్న, ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చిన రోడ్లు, భవనాల వంటి ప్రజా ప్రయోజన మౌలిక వసతులను సైతం రద్దు చేస్తున్నది. ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. అయితే గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయి అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలి. ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాలు ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దు చేసినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది. దీంతోపాటు గొర్రెల పంపిణీ ద్వారా లక్షలాదిమంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. బలహీన వర్గాల్లో కీలకమైన యాదవ సామాజిక వర్గానికి ఆర్థిక భరోసా కలిగించే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా చెల్లించాల్సిన డిడిలు కట్టిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయాలి. దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తున్నది. ఎన్నికల్లో దళిత బంధు కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి, ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు దళిత బంధు ప్రకారం 10 లక్షలైనా ఇవ్వాలి లేదా కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు 12 లక్షల రూపాయలైనా వెంటనే అందించాలి. దళిత బందుకు ఎంపికైన వారికి వెంటనే నిధులు చెల్లించి వారి యూనిట్లు ప్రారంభం అయ్యేలా చూడాలి” అని కేటీఆర్, హరీశ్ రావు డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమాలు

సంక్షేమ కార్యక్రమాల అమలుపైన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ధిదారులకు అండగా నిలబడేలా నిరసన కార్యక్రమాలను పార్టీ తరఫున చేపడుతామన్నారు కేటీఆర్, హరీశ్ రావు. “లబ్ధిదారుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నాం. కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే రద్దు చేయడం కాకుండా... గత ప్రభుత్వం పట్టణాలకు, గ్రామాలకు మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తున్నది. మునిసిపాలిటీలకు టియుఎఫ్ఐడిసి మరియు ఇతర సంస్థల ద్వారా శాఖ ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరిని రద్దు చేస్తున్నది. ఇప్పటికే ఈ నిధులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కూడా అయింది. రోడ్లు, భవనాలు, ఇతర పౌరవసతుల కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో వీటిని రద్దు చేయడం దుర్మార్గం. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్ల మంజూరు ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటూ వెళుతున్న తీరుపైన ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలి” అని ఇద్దరు నేతలు దిశానిర్దేశం చేశారు.

Whats_app_banner