Kazipet Coach Factory : ఓరుగల్లులో ‘కోచ్ ఫ్యాక్టరీ’ కొట్లాట, క్రెడిట్ మాదేనంటున్న మూడు ప్రధాన పార్టీలు
02 December 2024, 19:17 IST
Kazipet Coach Factory : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ క్రెడిట్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ కొట్లాట మొదలుపెట్టాయి. తమ పోరాటం వల్లే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని మూడు పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఓరుగల్లులో ‘కోచ్ ఫ్యాక్టరీ’ కొట్లాట, క్రెడిట్ మాదేనంటున్న మూడు ప్రధాన పార్టీలు
Kazipet Coach Factory : ఓరుగల్లు రాజకీయ పార్టీల్లో కొత్త కొట్లాట మొదలైంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కల ఇటీవల సాకారం కాగా.. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ తీసుకు వచ్చిన క్రెడిట్ మాదంటే మాదేనని మూడు ప్రధాన పార్టీలు కొట్లాడుకుంటున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. తమ పార్టీ పెద్దలను ఒప్పించి కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చామని ఆ పార్టీ నేతలు అంటుంటే.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొట్లాడటం వల్లే కేంద్రం కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసిందని హస్తం పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే.. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడామని, తమ పోరాటాలకే కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలా మూడు పార్టీలు కోచ్ ఫ్యాక్టరీ తెచ్చిన క్రెడిట్ అంతా తమదేనని కొట్లాడుకుంటుండగా, ఫ్యాక్టరీ ఎవరు తెచ్చినా అందులో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఎప్పుడెప్పుడేం జరిగింది?
సౌత్ సెంట్రల్ రైల్వేలో కాజీపేట జంక్షన్ కు కీలక స్థానం ఉంది. నార్త్ ఇండియాకు పోవాలన్నా.. సౌత్ ఇండియా వైపు వెళ్లాలన్నా ఈ జంక్షన్ నుంచే మళ్లాల్సి ఉంటుంది. అంతేగాకుండా తెలంగాణలో రెండో అతి పెద్ద జంక్షన్ గా ఉండటం, ఇక్కడి నుంచి ఆదాయం కూడా పెద్ద మొత్తంలోనే సమకూరుతుండటంతో ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దాదాపు ఆరు దశాబ్ధాల నుంచి ఉంది. 1969లోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. అప్పటి కమ్యూనిస్టు నేతలు బీఆర్ భగవాన్ దాసు, కాళీదాసు నేతృత్వంలో ఈ కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం ప్రారంభం కాగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. కాగా 1978–80 మధ్య కాలంలో అన్ని పార్టీలు తమతమ కండువాలను పక్కన పెట్టేసి అఖిలపక్షంగా ఏర్పడి కోచ్ ఫ్యాక్టరీ కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విన్నవించారు. దీంతో ఇందిరాగాంధీ 1982లో పార్లమెంట్‌లో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేశారు.
కానీ స్థల సేకరణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అడుగులు పడలేదు. కాగా 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురవడం, ఖలిస్థాన్ ఉద్యమ నేపథ్యంలో ఆ కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తాలకు తరలించారు. ఆ తరువాత 2004లో మరోసారి కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు. కానీ ఆ తరువాత దానిని రాయిబరేలికి తరలించారు. ఇదిలా ఉంటే 2010–11 బడ్జెట్ లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, రూ.15 కోట్లు మంజూరు కూడా చేసింది. ఆ తరువాత దీనికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 54 ఎకరాల భూమిని కేటాయించగా.. ఆ స్థలంపై వివాదాలు రావటంతో ఆ ప్రాజెక్టు తెర వెనక్కి వెళ్లిపోయింది. ఇక తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని చేర్చారు. కానీ ఆ తరువాత కోచ్ ఫ్యాక్టరీ అంశం పార్టీల మాటల యుద్ధానికే పరిమితమైంది. కాగా దేశంలో కొత్తగా కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని చెబుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం 2016లో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీకి బదులు పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) వర్క్ షాపును ప్రకటించింది.
దానికి కోసం 160 ఎకరాలు అవసరం కాగా.. మడికొండ, అయోధ్యపురం గ్రామాల శివారులోని ఎండోమెండ్ భూములను సేకరించారు. ఈ మేరకు గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు జులై 8న వరంగల్ కు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీవోహెచ్ ను అప్ గ్రేడ్ చేసి, వ్యాగన్ మాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. అయినా కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ మాత్రం నెరవేరకపోవడంతో ఓరుగల్లు ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండేది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ లోనే కాజీపేట వ్యాగన్ తయారీ యూనిట్ ను ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా రైల్వే శాఖకు ఉత్తర్వులు కూడా అందాయి. కానీ కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా నవంబర్ 28న వెలుగులోకి వచ్చాయి.
మూడు పార్టీల కొట్లాట
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు కావడానికి తమ కృషే కారణమంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఎవరికి వారు సంబరాలు నిర్వహించుకోవడంతో పాటు పోటాపోటీగా మీడియా సమావేశాలు కూడా నిర్వహించి, కోచ్ ఫ్యాక్టరీ క్రెడిట్ అంతా తమదేనని చెప్పుకుంటున్నారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేసింది బీఆర్ఎస్సే: దాస్యం
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేసింది బీఆర్ఎస్ పార్టీనేని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చెబుతున్నారు. ఈ మేరకు కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన విషయం వెలుగులోకి వచ్చిన తరువాత ఆయన ప్రత్యేకంగా కాజీపేట జంక్షన్ ను విజిట్ చేసి, టపాసులు కాల్చి సంబరాలు కూడా జరిపారు. మీడియా సమావేశం కూడా నిర్వహించి తెలంగాణ కోసం కొట్లాడినట్టే కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడిందని చెప్పుకొచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేశామని, ఉద్యమ సమయంలో కూడా శ్రీకృష్ణ కమిటీకి వినతిపత్రాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిసి కలిసి విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని పొందుపరిచేలా ఒత్తడి చేశామంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ కొట్లాడటం వల్లనే కేంద్ర ప్రభుత్వం కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ తోనే సాధ్యమైంది: రావు పద్మారెడ్డి
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయడం బీజేపీతోనే సాధ్యమైందని ఆ పార్టీ జిల్లా అద్యక్షురాలు రావు పద్మారెడ్డి చెబుతున్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని ఇతర ప్రాంతాలకు తరలించిందని, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓరుగల్లు అభివృద్ధికి పాటుపడుతూ కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చిందంటున్నారు. ఇప్పటికే వరంగల్ కు స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ లాంటి పథకాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసి చిత్తశుద్ధి చాటుకుందని చెబుతున్నారు. కాగా కాజీపేట కల నెరవేర్చింది తమ పార్టేనంటూ నవంబర్ 29న బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఫొటోలకు పాలతో అభిషేకాలు కూడా నిర్వహించారు.
కాంగ్రెస్ పోరాట ఫలితమే..: నాయిని రాజేందర్ రెడ్డి
.సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల పోరాట ఫలితంగానే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి కాజీపేటలోని వ్యాగన్ తయారీ యూనిట్ ను కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేయించారని చెబుతున్నారు. గతంలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే ఓరుగల్లు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఈ మేరకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేశారు. ఇలా మూడు పార్టీలు ఎవరికి వారు కోచ్ ఫ్యాక్టరీ క్రెడిట్ అంతా తమదేనని చెప్పుకుంటుండగా.. ఉమ్మడి పోరాటాల ఫలితంగానే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కల నెరవేరిందని రైల్వే సంఘాల నేతలు అంటున్నారు. ఏది ఏమైనా దశాబ్ధాల కల నెరవేరగా.. ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చొరవ చూపాలని ఓరుగల్లు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)