Karimnagar News : కరీంనగర్ భారతీయుడికి వింత అనుభవం, అవినీతిని ప్రశ్నించినందుకు సొంత భూమి రిజిస్ట్రేషన్ కు అడ్డంకులు
15 July 2024, 19:51 IST
- Karimnagar News : నేటి సమాజంలో నిజాయితీగా ఉంటే ఇబ్బందులు తప్పవు అని మరోసారి రుజువైంది. అధికారుల అవినీతిపై ప్రశ్నించినందుకు ఓ వ్యక్తిని తహశీల్దార్, ఇతర అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ కానివ్వకుండా మూడేళ్లుగా తిప్పుతున్నారు.
కరీంనగర్ లో భారతీయుడు సంఘటన, అవినీతిని ప్రశ్నించినందుకు సొంత భూమి రిజిస్ట్రేషన్ కు అడ్డంకులు
Karimnagar News : కరీంనగర్ కలెక్టరేట్ ముందు సామాజిక కార్యకర్త రేకుర్తి చెందిన దుర్గం మనోహర్ వినూత్న ఆందోళనకు దిగాడు. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడం పట్ల అధికారులు అన్నం తింటున్నారా?.. పెండ తింటున్నారా?.. డబ్బులే కావాలా?.. మందు తాగుతారా? అంటూ కలెక్టరేట్ ముందు బైఠాయించి విస్తరాకులో మందు, డబ్బులు, పెండ పెట్టి నిరసన తెలిపారు. అధికారుల అవినీతి అక్రమాలను సామాజిక కార్యకర్తగా ప్రశ్నించినందుకే రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపించారు. గత మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఇచ్చిన వినతి పత్రాలు ఆయన చేస్తున్న పోరాటానికి సంబంధించిన ఆధారాలను ప్లెక్సీ రూపంలో ప్రదర్శించి నిరసన తెలిపారు.
కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన దుర్గం మనోహర్ తండ్రి మల్లయ్య పేరిట సర్వే నంబర్ 432లో రెండెకరాల 16 గుంటల భూమి ఉంది. గత 30 సంవత్సరాల కితం కొనుగోలు చేసి పట్టా చేసుకున్న భూమిలో 4 గుంటల 25 గజాల స్థలాన్ని బండ కిషోర్ రెడ్డికి విక్రయించి పట్టా చేశారు. మూడేళ్ల క్రితం తండ్రి మల్లయ్య మృతి చెందడంతో మిగతా భూమి తల్లి పేరిట విరాసత్ చేశారు. నలుగురు కొడుకులు ఉండడంతో మనోహర్ వాటాకు వచ్చే 21 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలన్ కట్టి ధరణి వెబ్ సైట్ లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేయకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మార్వో పైనే ఫిర్యాదు చేశావని అధికారులను అవినీతిపరులుగా చిత్రీకరించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోనే రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ ఇబ్బందుల గురిచేస్తున్నారని మనోహర్ ఆవేదనతో తెలిపారు.
భారతీయుడిలా అధికారుల అక్రమాలపై పోరాటం
సామాజిక కార్యకర్త అయిన దుర్గ మనోహర్ సమాజంలో జరిగే అవినీతి అక్రమాలపై గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 వ డివిజన్ లోని సర్వే నెంబర్ 55, 137 లో గల ప్రభుత్వ భూమి, మద్దినాల ప్రభుత్వ భూములు కాపాడాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. కాలేజీ స్థలాలకు ఇంటి నంబర్లతో విద్యుత్ మీటర్లు మంజూరు చేసిన దానిపై లైన్మెన్ పై ట్రాన్స్ కో ఎస్ఈకి ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. తన దృష్టికి వచ్చిన ఏ ఒక్క అవినీతి అక్రమాలను సహించకుండా అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మనోహర్ సొంత సమస్య జటిలంగా మారింది.
నిజాయితీగా పోరాడితే ఇబ్బందులు తప్పవా
రేకుర్తిలో ప్రభుత్వ భూములు కబ్జా, అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ మున్సిపల్ అధికారులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో కక్షగట్టి తన సొంత భూమిని రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకుంటున్నారని మనోహర్ ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వారసత్వంగా రావాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని దానిలో స్లాట్ బుక్ చేసుకొని వెళితే తమపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ తహశీల్దార్ భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న తహసిల్దార్ ను అడిగితే ఆర్డీఓ దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉందంటూ తిప్పుకుంటున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ కు, సీసీఎల్ఏ లో ప్రజాదర్బార్ లో ఫిర్యాదు చేస్తే ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆర్డీవోను విచారించి తగు చర్యల చేపట్టాలని ఆదేశించారని ఆర్డీవో మాత్రం గతంలో ఉన్న ఎమ్మార్వోకు వత్తాసు పలుకుతూ తమ శిష్యుడు పైనే ఫిర్యాదు చేస్తావా అంటూ తన ఫైల్ ను పెండింగ్ లో పెట్టి రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో అధికారులు అన్నం తింటున్నారా...పెండ తింటున్నారా.. డబ్బులే కావాలా.. మందు తాగుతారా.. అంటూ నిరసన తెలుపుతున్నానని మనోహర్ ఆవేదనతో తెలిపారు. నిజాయితీగా అక్రమాలపై పోరాడితే ఇబ్బందులకు గురి చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తన గోడును పట్టించుకోని తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు