Lower Manair Dam : ఎత్తిపోసి వదిలేసి, ముచ్చటగా మూడోసారి- లోయర్ మానేరు గేట్లు ఎత్తివేత
07 October 2024, 15:40 IST
- Lower Manair Dam : గత 25 రోజుల్లో మూడోసారి లోయర్ మానేర్ డ్యామ్ గేట్లు ఎత్తారు. వర్షాలకు ముందు నంది పంప్ హౌస్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని మిడ్ మానేర్ కు అక్కడి నుంచి లోయర్ మానేరుకు విడుదల చేశారు. ఈ నీటిని వృద్ధాగా వదులుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఎత్తిపోసి వదిలేసి, ముచ్చటగా మూడోసారి- లోయర్ మానేరు గేట్లు ఎత్తివేత
పాతిక రోజుల్లో ముచ్చటగా మూడోసారి కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ గేట్లత్తారు. రెండు గేట్లు ఎత్తి 5000 క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు వాగులోకి వదిలారు. మిడ్ మానేర్ నుంచి 12 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీకి చేరుతుంది. వర్షాలు వరదలతో వచ్చిన నీళ్ల కంటే ఈసారి ఎత్తిపోసిన నీళ్లతోనే ఎల్ఎండీ నిండు కుండను తలపిస్తుంది.
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలల వరకు లోయర్ మానేర్ డ్యామ్ లో నీళ్లు డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. జులై ఆగస్టులో ఆశించినంత స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఎల్ఎండీకి వరద రాలేదు. ఆగస్టు మొదటి వారం వరకు ఎల్ఎండీలో కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉండేది. కరీంనగర్ నగరం తో పాటు సిద్దిపేట, మానకొండూర్, నియోజకవర్గాలకు తాగునీటి సమస్య తప్పదనే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది మేడారం పంప్ హౌస్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని మిడ్ మానేర్ రిజర్వాయర్ కు ఎత్తిపోశారు.
ఎత్తిపోసిన నీటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి వదిలారు. దాదాపు రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎల్ఎండీకి తరలించి నీటి మట్టం 15 టీఎంసీలకు చేర్చారు. ఇక తాగునీటి కష్టాలు ఉండవని భావించిన తరుణంలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎల్ఎండీ ఆగస్టు చివరి వారంలో పూర్తిస్థాయిలో నిండింది. వరద పోటెత్తడంతో ఎత్తిపోసిన నీరు ఖరీదైనది కావడంతో వృధా చేయకుండా కాకతీయ కాలువకు వదిలారు.
డెడ్ స్టోరేజ్ నుంచి జలకళ వరకు
24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎల్ఎండీలో ఆగస్టు చివరి వారం వరకు సగం కూడా నిండ లేదు. పది టీఎంసీలకు పైగా ఎత్తిపోసిన నీటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీ వదలడంతో జలకళ సంతరించుకుంది. అల్పపీడన ప్రభావాలతో కురిసిన వర్షాలతో ఎగువ మానేర్, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్ లు పూర్తి స్థాయిలో నిండాయి. ఎత్తిపోసిన నీళ్లు ఖరీదైనవి కావడంతో వృధా చేయకుండా అధికారులు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ లో తొలిసారి రెండు గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేర్ వాగులోకి విడుదల చేసి గంటన్నరలోపే గేట్లు మూసేశారు.
రెండోసారి సెప్టెంబర్ 29న రెండు గేట్లు ఎత్తి 5202 క్యూసెక్కుల నీటిని దిగువ మానేర్ లోకి విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 3500 క్యూసెక్కులు వదిలారు. 12 గంటల పాటు గేట్లెత్తి నీటి వదిలిన అధికారులు ఆ తర్వాత గేట్లు మూసేశారు. ప్రస్తుతం మిడ్ మానేరు నుంచి సుమారు 12 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ఎల్ఎండీకి చేరుతుండడంతో ఎల్ఎండీ పూర్తిస్థాయిలో నిండింది. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తి 5000 క్యూసెక్కుల మానేరు వాగులోకి వదిలారు. మరో 5 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువకు విడుదల చేస్తున్నారు.
ఖరీదైన నీళ్లు వృధాగా
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసిన ఖరీదైన వాటర్ వృధాగా వదులుతున్నారనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎత్తిపోసిన నీటిని వృధా చేయకుండా స్టోరేజ్ చేయాల్సింది పోయి మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి తరలించిన నీటిని ఎల్ఎండీ నుంచి వృధాగా మానేరు వాగులోకి వదలడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా అధికారులు నీటిని వృధా చేయకుండా మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదలను ఆపి, ఎల్ఎండీ వాటర్ వృధా చేయకుండా కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు