Lower Manair Dam : లోయర్ మానేర్ కు జలకళ, మిడ్ మానేర్ ఐదు గేట్లు ఎత్తివేత-karimnagar mid manair dam gates lifted lower manair dam filled with water ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Lower Manair Dam : లోయర్ మానేర్ కు జలకళ, మిడ్ మానేర్ ఐదు గేట్లు ఎత్తివేత

Lower Manair Dam : లోయర్ మానేర్ కు జలకళ, మిడ్ మానేర్ ఐదు గేట్లు ఎత్తివేత

HT Telugu Desk HT Telugu
Aug 26, 2024 09:55 PM IST

Lower Manair Dam : కరీంనగర్ లోని లోయర్ మానేర్ డ్యామ్ జలకళ సంతరించుకోబోతుంది. మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేసి లోయర్ మానేర్ నింపుతున్నారు. ఐదు గేట్లు ఎత్తి 14600 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీకి విడుదల చేశారు. లోయర్ మానేర్ లో నీటిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోయర్ మానేర్ కు జలకళ, మిడ్ మానేర్ ఐదు గేట్లు ఎత్తివేత
లోయర్ మానేర్ కు జలకళ, మిడ్ మానేర్ ఐదు గేట్లు ఎత్తివేత

Lower Manair Dam : ఎడారిని తలపిస్తున్న కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ జలకళను సంతరించుకోబోతుంది. మిడ్ మానేర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. డెడ్ స్టోరేజ్ లో ఉన్న ఎల్ఎండీని నింపే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మానేర్ పైన ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరదలు రాక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసి మానేర్ డ్యామ్ లను నింపుతున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం మిడ్ మానేర్ గేట్లు ఎట్టకేలకు ఎత్తారు. రెండు రోజుల క్రితం ఒక గేటును మీటర్ వరకు ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు మూడు రోజుల్లో ఐదు గేట్లు ఎత్తి 14600 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న లోయర్ మానేర్ డ్యామ్ ఎల్ఎండీకి విడుదల చేస్తున్నారు. క్రమంగా పెంచుతున్నారు. మిడ్ మానేర్ కు ఇన్ ఫ్లో 11650 క్యూసెక్కులు...ఔట్ ఫ్లో 14710 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.84 టీఎంసీల నీరు ఉంది. మిడ్ మానేర్ నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున పదిరోజుల పాటు పది టీఎంసీల నీటిని ఎల్ఎండీకి విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

నిరాటంకంగా కొనసాగుతున్న ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు

మిడ్ మానేర్ రిజర్వాయర్ కు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. గత నెల రోజుల నుంచి నంది, గాయిత్రి పంప్ హౌస్ ల ద్వారా 9450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 27176 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 9880 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగ ప్రస్తుతం నీటి నిలువ17.508 TMCలు ఉంది.

ఎత్తిపోతలతో ఎల్ఎండీకి జీవం

కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాం కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు తాగు సాగునీటికి జీవనాధారం. 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎల్ఎండీ నీటి కష్టాలను ఎదుర్కొంటుంది. మూడు రోజుల క్రితం డెడ్ స్టోరేజ్ లో అనగా 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వర్షాకాలం ఆరంభమైనప్పటి నుంచి గడిచిన మూడు మాసాల్లో కనీసం ఒక్క టీఎంసీ నీరు కూడా వచ్చి ఎల్ఎండీలో చేరలేదు. దీంతో ఉన్న నీటిని పొదుపుగా దినం తప్పించి దినం లేదా రెండు రోజులకు ఒకసారి కరీంనగర్ ప్రజలకు వాటర్ సప్లై చేస్తున్నారు.‌ ఆగష్టు మాసం చివరి దశకు చేరిన ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరదలు రాక ఎల్ఎండీ డెడ్ స్టోరేజీలో ఉండడంతో భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవని భావించిన అధికార యంత్రాంగం, పాలకులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేర్ కు తరలివస్తున్న వాటర్ ను ఎల్ఎండీకి తరలించాలని భావించి గేట్లెత్తి నీటి విడుదల చేశారు.

రోజుకు ఒక టీఎంసీ చొప్పున పక్షం రోజుల్లో 15 టీఎంసీలకు పైగా నీటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎల్ఎండీకి ప్రస్తుతం ఇన్ ఫ్లో 14814 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 214 క్యూసెక్కులు ఉంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగ ప్రస్తుతం ఏడు టీఎంసీలకు చేరింది. మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ లో ఉన్న ఎల్ఎండీ ప్రస్తుతం మిడ్ మానేర్ నుంచి నీటి విడుదలతో జలకళ సంతరించుకోబోతుంది.

నీటి విడుదలతో హర్షం...

మునుపెన్నడూ లేని విధంగా లోయర్ మానేర్ డ్యాం నీటి కొరతను ఎదుర్కొంటుంది. తాగడానికి సైతం నీళ్లు దొరకవని భావిస్తున్న తరుణంలో మిడ్ మానేర్ గేట్లు ఎత్తి ఎల్ఎండీకి నీటిని విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.‌ మిడ్ మానేర్ నుంచి 15 టీఎంసీలకు పైగా నీటిని విడుదల చేసి ఎడారని తలపిస్తున్న ఎల్ఎండీని నింపాలని కోరుతున్నారు. డ్యామ్ నిండితే తాగునీటి సమస్య పరిష్కారమై యాసంగిలో సాగునీరు సైతం అందుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఆ దిశగా అధికారులు పాలకులు చర్యలు చేపట్టాలని రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.‌

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం