తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Dumping Yard : కాలుష్య కోరల్లో కరీంనగర్- డంపింగ్ యార్డ్ దగ్ధంతో నగరాన్ని ఆవహిస్తున్న పొగ

Karimnagar Dumping Yard : కాలుష్య కోరల్లో కరీంనగర్- డంపింగ్ యార్డ్ దగ్ధంతో నగరాన్ని ఆవహిస్తున్న పొగ

HT Telugu Desk HT Telugu

10 April 2024, 22:50 IST

google News
    • Karimnagar Dumping Yard : కరీంనగర్ డంపింగ్ యార్డు మంటలు చెలరేగి సమీప ప్రాంతాల్లో పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర శ్వాస ఇబ్బందులు పడ్డారు. డంపింగ్ యార్డు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కాలుష్య కోరల్లో కరీంనగర్
కాలుష్య కోరల్లో కరీంనగర్

కాలుష్య కోరల్లో కరీంనగర్

Karimnagar Dumping Yard : కాలుష్యం కోరల్లో కరీంనగర్(Karimnagar Pollution) చిక్కుకుందా? డంపింగ్ యార్డ్(Dumping Yard) నగర ప్రజలకు ప్రాణసంకటంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. డంపింగ్ యార్డ్ దగ్ధంతో నగరాన్ని దట్టమైన పొగ ఆవహించింది. శ్వాస ఆడక నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పట్టించుకునేవారు కానరాక స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

శ్వాస తీసుకోలేని పరిస్థితి

కరీంనగర్ (Karimnagar)సమీపంలోని మానేర్ తీరాన మున్సిపల్ డంపింగ్ యార్డు ఉంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న డంపింగ్ యార్డు లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగమాత్రం దావాలంగా వ్యాపించింది. నగరాన్ని చుట్టూముట్టింది. దట్టమైన పొగ ఆటో నగర్, అల్గునూర్, కోతి రాంపూర్, కట్టరాంపూర్, అల్కాపురికాలనీ, హనుమాన్ నగర్ తోపాటు చుట్టు రెండు కిలోమీటర్ల దూరం పొగ అలుముకుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలుగునూరు నుంచి కోతిరాంపూర్, హౌజింగ్ బోర్డు కాలనీ వరకు పొగతో దారి కనిపించక ఆ రూట్ లో వెళ్లేవారు ఇక్కట్ల పాలవుతున్నారు.

మూతపడ్డ షాప్ లు... ఆందోళనలో స్థానికులు

డంపింగ్ యార్డ్ తగలబడుతూ దట్టమైన పొగతో యార్డు సమీపంలోని ఆటోనగర్(Autonagar) లో షాప్ లు మూతపడ్డాయి. ఆటోనగర్ లో 200లకుపైగా షాపులు ఉండగా యార్డు సమీపంలోని వందకు పైగా షాపులకు వర్కర్స్ రాలేని పరిస్థితి ఏర్పడింది. పొగతో శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన పొగతో ఊపిరాడక..పొగ పీల్చడంతో శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చే వరకు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంటుందని తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని యార్డు సమీపంలో పనిచేసే కార్మికులు, యాజమానులు చెబుతున్నారు. మునిసిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పొగ రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

చోద్యంగా చూస్తున్న అధికారులు

డంపింగ్ యార్డ్ పొగతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు చోద్యంగా చూస్తూ ఉండడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తుంది. యార్డుతో బతకలేకపోతున్నామని అంటున్నారు. పొగతో కళ్ల మంట, ఊపిరితిత్తులు డ్యామేజ్ కావడం లాంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని ఇప్పటికే పలువురు ఆసుపత్రుల పాలయ్యారని స్థానికులు తెలిపారు. ప్రాణ సంకటంగా మారిన డంపింగ్ యార్డు(Dumping Yard)ను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం డంపింగ్ యార్డ్ పై మాట్లాడడానికే నిరాకరిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం నివాస ఉండే నగరంలో దట్టమైన పొగ ఆవహించి ఊపిరాడకుండా చేస్తున్నా సమస్య తో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

HT Correspondent K.VREDDY, Karimnagar

తదుపరి వ్యాసం