తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kamareddy Bjp : రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను ఓడించిన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేతలు!

Kamareddy BJP : రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను ఓడించిన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేతలు!

HT Telugu Desk HT Telugu

11 February 2024, 18:28 IST

google News
    • Kamareddy BJP : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిని బీజేపీ జహీరాబాద్ లోక్ సభ స్థానానికి బాధ్యునిగా నియమించింది. ఇద్దరు హేమాహేమీలను ఓడించిన వెంకటరమణ రెడ్డికి సొంత పార్టీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేతలు
బీజేపీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేతలు

బీజేపీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేతలు

Kamareddy BJP : కామారెడ్డి ఎమ్మెల్యేగా ప్రస్తుత ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించి వార్తల్లో నిలిచిన కాటిపల్లి వెంకటరమణ రెడ్డిని జహీరాబాద్ లోక్ సభ స్థానానికి బాధ్యునిగా నియమించి గౌరవించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ). రాబోయే ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించాలని, వెంకటరమణ రెడ్డి లాంటి బలమైన నాయకున్ని జహీరాబాద్ కు ఇన్ ఛార్జ్ గా నియమించింది. అయితే ఆ ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేతలు చుక్కలు చుపిస్తున్నారంట. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సన్నాహక సమావేశాలకు రాకుండా సహాయ నిరాకరణ ఎందుకు చేస్తున్నారంట. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో పార్లమెంట్ స్థానం ఇన్ ఛార్జ్ బాధ్యతలు తనకు కత్తిమీద సాములా మారాయంట. అధిష్టానం ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తుంది అనేది పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

హిందువులు, లింగాయత్ ల ఓట్ల పై ఆశలు

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లాలో ఉండగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో, ఈసారి బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచింది. ఇక్కడ లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో, అయోధ్య మందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో హిందువుల ఓట్లపై కూడా ఆశలు పెట్టుకుంది బీజేపీ. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిని పార్టీ నియమించింది. అలాగే సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా గోదావరి అంజి రెడ్డిని నిమయమించి పార్టీలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక అప్పటి నుంచి వెంకటరమణ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను కలుస్తూ సమన్వయం చేయడానికి యత్నిస్తున్నారు.

సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ

కామారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా సంగారెడ్డి జిల్లాలో మాత్రం అగమ్య గోచరంగా ఉందట. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు తక్కువ వచ్చాయట. అయితే లోక్ సభ ఎన్నికలకి సిద్ధం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించడం వెంకటరమణ రెడ్డికి కత్తిమీద సాములా మారిందట. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లు వెంకటరమణ రెడ్డి సన్నాహక సమావేశాలకు హాజరవ్వకుండా స్థానిక బీజేపీ నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నారట. దీనితో కేవలం పార్లమెంట్ ఇన్ ఛార్జ్, జిల్లా అధ్యక్షురాలితో సన్నాహక సమావేశాలు నిర్వహించి మమా అనిపిస్తున్నారట. నారాయణఖేడ్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సంగప్ప అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు హాజరువుతున్నారట. జహీరాబాద్ ఇన్ ఛార్జ్ రామచందర్ రాజనర్సింహ అసలు నియోజకవర్గాలకు రాకుండా డుమ్మాలు కొడుతూ ఎమ్మెల్యేకి చుక్కలు చూపిస్తున్నారట. స్థానిక నాయకులు కూడా ఈ సమావేశాలను లైట్ తీసుకుంటున్నారట.

సమన్వయం చేయలేకపోతున్న గోదావరి అంజిరెడ్డి

మరో వైపు సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జిల్లా నేతల్ని సమన్వయం చేయడంలో ఫెయిల్ అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జహీరాబాద్ నుంచి ఈసారి బీజేపీ టికెట్ ఆశించేవారు డజనుకు పైగానే ఉన్నారు. జహీరాబాద్ బీజేపీ గెలుపు అవకాశాలపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. అయితే స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. సహకరించని నేతలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు..తనకి చుక్కలు చూపిస్తున్న బీజేపీ నేతల వెనుక ఎవరైనా ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారట వెంకటరమణ రెడ్డి. మరి నిజంగానే దీని వెనుక ఎవరైనా ఉన్నారా? లేదా నేతలే కావాలని లైట్ తీసుకుంటున్నారా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలపై ఆరా తీస్తుందట అధిష్టానం. మరి బీజేపీ నేతల సహాయ నిరాకరణకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

(కామారెడ్డి రిపోర్టర్, హెచ్.టి.తెలుగు)

తదుపరి వ్యాసం