BRS Zaheerabad MP Ticket 2024 : అభ్యర్థి మార్పుపై కసరత్తు..? తెరపైకి మరో నేత - జహీరాబాద్ లో ఏం జరగబోతుంది..?
13 January 2024, 10:03 IST
- Zaheerabad Lok Sabha Constituency : లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. చేయాల్సిన మార్పులతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. అయితే ఈసారి జహీరాబాద్ నుంచి కొత్త వ్యక్తిని బరిలో దింపే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటుంది.
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు
BRS Zaheerabad MP Ticket 2024: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం తర్వాత… బీఆర్ఎస్ పార్టీ తాను చేసిన తప్పులను కరెక్ట్ చేసుకొని లోక్ సభ ఎన్నికలో బరిలోకి దిగబోతుందని ఆ పార్టీ నాయకులూ చెబుతూ వస్తున్నారు. అభ్యర్థులను మారిస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలిచేవాళ్లమని ఆ పార్టీ నాయకులూ పదే పదే చెబుతున్న సమయంలో… రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేని సిట్టింగ్ ఎంపీలను కూడా మార్చే అవకాశమున్నదని ఆ పార్టీ నాయకులంటున్నారు.
ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిలాల్లో ఉన్న జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో కూడా అలాంటిమార్పు ఉండబోతున్నదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో, ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ కేవలం 6 వేల ఓట్ల తేడాతో గెలవటం, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఆ పార్టీ కి అనుకూలంగా లేకపోవటం వంటి కారణాల నేపథ్యంలో… తప్పకుండా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇక్కడ అభ్యర్థిని మారుస్తుందని సొంత పార్టీ నేతలు వాదన వినిపిస్తున్నారు.
తెరపైకి సుభాష్ రెడ్డి.....
టికెట్ ఆశించే వారిలో… ముందు వరుసలో కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఉన్నారు. సుభాష్ రెడ్డి తాను చదువుకున్న ప్రభుత్వ స్కూల్ కి ఆరు కోట్ల సొంత డబ్బు ఖర్చు పెట్టి అధునాతన బిల్డింగ్ కట్టించడంతో తన పేరు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ మార్మోగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీచేయటంతో, సుభాష్ రెడ్డిని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రే తన ఇంటికి పిలిసి తన తరపున ప్రచారం చేయాలనీ కోరారు. సుభాష్ రెడ్డి ప్రచార బాధ్యతను తన భుజస్కందాలపైనా వేసుకొని గ్రామా గ్రామం తిరిగారు. ముఖ్యమంత్రి తృటిలో ఓడిపోయిన, తనకు చంద్రశేఖర్ రావు, కేటీ రామ రావు తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏడూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఐదు కోల్పోవటం జరిగింది.
సామజిక స్పృహ ఉన్న పారిశ్రామికవేత్త.....
ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో, పార్టీ నాయకత్వం బీబీ పాటిల్ ని పక్కకు పెట్టి, సామజిక స్పృహ ఉన్న సుభాష్ రెడ్డి లాంటి వారిని అభ్యర్థిగా నిలిపితే పార్టీకి అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాను జహీరాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా సామజిక కార్యక్రమాలు చేపట్టడం వలన, పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటాయని సుభాష్ రెడ్డి కూడా చెబుతున్నట్లు తెలిసింది. బీబీ పాటిల్ దగ్గర ఉన్న బీఆర్ఎస్ నాయకులూ మాత్రం… చంద్రశేఖర్ రావు మల్లి తమ నేతకే టికెట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గం తప్ప మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కామారెడ్డి నియోజకవర్గంలో, బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలవగా, అందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి.
రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి.