తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kaleshwaram Saraswathi Pushkaralu : వచ్చే ఏడాది కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు, ఏర్పాట్లకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు

Kaleshwaram Saraswathi Pushkaralu : వచ్చే ఏడాది కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు, ఏర్పాట్లకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు

HT Telugu Desk HT Telugu

25 September 2024, 19:55 IST

google News
    • Kaleshwaram Saraswathi Pushkaralu :వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. దేవాదాయశాఖ పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. కాళేశ్వరం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో రూ.145 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
వచ్చే ఏడాది కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు, ఏర్పాట్లకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు
వచ్చే ఏడాది కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు, ఏర్పాట్లకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు

వచ్చే ఏడాది కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు, ఏర్పాట్లకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు

Kaleshwaram Saraswathi Pushkaralu : త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు సమయం ఆసన్నమయింది. వచ్చే సంవత్సరం మే నెలలో నిర్వహించే పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాలపై ఆయన సతీమణి సీనియర్ ఐఏఎస్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రాణహిత, గోదావరి నదుల సంగమం అయిన కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుంది. వచ్చే ఏడాది మేలో పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నం అయింది. ఈ మేరకు దేవాదాయ, ధర్మాదాయ ప్రిన్సిపల్ సెక్రటరి శైలజా రామయ్యర్, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ లు కాళేశ్వరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.

అంతర్వాహిని సరస్వతి

కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరినదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. రెండు నదులు సంగమించిన చోట సరస్వతి అంతర్వాహిని నది ఉద్బవిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వేలాది ఏళ్ల క్రితం దేశంలో సరస్వతి నది ఉండేదని కాలగర్భంలో కలిసిపోయిందని కూడా చెప్తారు. అయితే కాళేశ్వరంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన ఈ క్షేత్రంలో యుముడు, శివుడు ఒకే పానవట్టంపై వెలిశారు. ముక్తీశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి. గర్భాలయంలోని ఈ లింగాన్ని అభిషేకించినప్పుడు ఆ నీరు, పంచామృతాలు భూ మార్గం గుండా గోదావరి, ప్రాణహిత నదులు కలిసే చోట వెల్లి కలుస్తోంది. భక్తులు స్వామి వారిని అభిషేకించిన నీరు, పంచామృతాలన్ని కూడా ప్రాణహిత, గోదావరి నదుల సంగమించే చోట వెళ్లి కలుస్తుండడంతో సరస్వతి అంతర్వాహినిగా ఆవిర్భావించిందని కాళేశ్వరం వాసులు చెప్తున్నారు.

అయితే నది ఉద్భవించడం వెనక ఉన్న చరిత ఏదైనప్పటికీ దేశంలో ప్రాశస్త్యం ఉన్న 12 నదులకు పుష్కరాలు జరగడం సంప్రదాయంగా వస్తుండగా ఏటా ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ 12 నదుల్లో సరస్వతి నది కూడా ఉండటంతో 12 ఏళ్లకోసారి ఈ నదికి కూడా పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. అయితే పుష్కర సంవత్సరం ఆరంభంలో కాళేశ్వరం ఆలయం తరుపున సాంప్రాదాయాన్ని కొనసాగించేవారు. సరస్వతి అంతర్వాహిని నదికి పుష్కరాలు నిర్వహించే ఆనవాయితీ నామమాత్రంగా సాగేది. కానీ వచ్చే పుష్కరాలను మాత్రం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ అధికారులు కాళేశ్వరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సారి సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సంకల్పించారు. సౌకర్యాలతో పాటు ఆలయాన్ని తీర్ధదిద్దడం, నది తీరంలో చేపట్టాల్సిన నిర్మాణాలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని శైలజా రామయ్యర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

రూ.145 కోట్లతో ప్రతిపాదనలు

కాళేశ్వరం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాళేశ్వరం ఆలయం అభివృద్దికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో తొలి విడతగా రూ. 145 కోట్లతో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నిధులతో చేపట్టాల్సిన నిర్మాణాలు, ఆలయంలో చేపట్టవలసిన మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేశారు. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన ప్రపోజల్స్ ను సీనియర్ ఐఏఎస్ అధికారులు శైలజ రామయ్యర్, హనుమంతరావులు పరిశీలించారు. దాని అమలుకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం