ganesh chaturthi 2024 : ఇదేం పాడుబుద్ధి.. వినాయకుడి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్లిన దొంగ!
08 September 2024, 14:26 IST
- ganesh chaturthi 2024 : హైదరాబాద్‌లో ఓ దొంగ తన పాడు బుద్ధిని ప్రదర్శించాడు. ఎవరైనా డబ్బులు, బంగారం, ఇతర వస్తువులు ఎత్తుకెళ్తారు గానీ.. ఈ దొంగ మాత్రం ఏకంగా వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూను ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
గణపతి లడ్డూ చోరీ
హైదరాబాద్ నగరం బాచుపల్లి పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కాలనీలో.. ఓ అపార్ట్‌మెంట్‌లో గణపతిని ప్రతిష్టించారు. అయితే.. శనివారం అర్ధరాత్రి ఓ దొంగ ఆ అపార్ట్‌మెంట్‌లోని వచ్చాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో.. గణపతి చేతిలో ఉన్న లడ్డూను చోరీ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు.. సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ దొంగపై అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ గల్లీలో సంబరాలు..
ఇటు హైదరాబాద్‌లోని ప్రతీ గల్లీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో మూడు చోట్ల జరిగే వినాయక చవితి వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఖైరతాబాద్, బాలాపూర్, గౌలిపుర వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత అంగంరంగ వైభవంగా జరుగుతాయి. ఈ మూడు ప్రాంతాల్లో.. ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత ఉంది.
గౌలిపుర గణపయ్య గురించి తెలుసా..
గౌలిపుర ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇక్కడ వినాయకుని ఉత్సవాలను అత్యంత పురాతనమైన ప్రసిద్ధ మండపాల్లో జరుపుతారు. ఇక్కడి మండపంలోని వినాయకుడిని చూసేందుకు.. తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. రద్దీకి తగ్గట్టు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు.
ఒక్కో ఏడాది.. ఒక్కోలా..
ఖైరతాబాద్ గణపతి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి. నవరాత్రి ఉత్సవాల సమయంలో.. నిత్యం వేలాది మంది భక్తులు గణపయ్య దర్శనం కోసం వస్తారు. ఖైరతాబాద్‌లో 1954 నుంచి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఇక్కడి వినాయకుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో ఎత్తుతో బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడి దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి వినాయకుడిని దర్శించుకుంటారు.
బాలాపూర్‌లో ఇదే ప్రత్యేకత..
ఇక బాలాపూర్ గణేశుడికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బాలాపూర్ లడ్డూ వేలం పాటకు ప్రత్యేకత ఉంది. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లో ప్రారంభమైంది. లడ్డూ వేలం పాటను మాత్రం 1994లో ప్రారంభించారు. అప్పడు కేవలం రూ.450తో వేలం మొదలైంది. ఈ లడ్డూను పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం. అందుకే ఈ వేలంపాటలో ఎక్కువ స్థానికులకే లడ్డూ దక్కుతుంది.