Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై పోటెత్తిన వరదనీరు-కిలోమీటర్ల మేర ట్రాఫిక జామ్
05 June 2024, 21:33 IST
- Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.
హైదరాబాద్ లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు
Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తోంది. బుధవారం సాయంత్రం నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసఫ్ గూడా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీ, కూకట్ పల్లి, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, మూసాపేట్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
అలాగే గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లో భారీ వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షంతో మాదాపూర్ టీ హబ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. మెహిదీపట్నం నుంచి లక్డీకపూల్ వెళ్లే మార్గంలోనూ కిలోమీటర్ల మేర కార్లు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.
గురువారం కూడా వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం కూడా పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకిన విషయ తెలిసిందే. రుతుపవనాలు తెలంగాణలోని నారాయణపేట, ఏపీలోని నరసాపురం గుండా వెళ్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
జూన్ 5, 6 నాటికి రుతుపవనాలు
రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల నేపథ్యంలో సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. రుతుపవనాలు తెలంగాణలో జూన్ 5, 6 తేదీల్లో విస్తరించనున్నాయని తెలిపింది. రుతుపవనాల రాకతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రాబోయే 3, 4 రోజుల్లో రుతుపవనాలు విస్తరణ
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రలోని ఇతర ప్రాంతాలలో విస్తరించే పరిస్థితులు అనుకూలంగా వాతావరణ అధికారులు వివరించారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బుధవారం ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.