TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు
11 May 2024, 15:25 IST
- TSRTC Dress Code : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వస్త్రధారణ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు
TSRTC Dress Code : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ పరిధిలో పని చేసే ఇతర సిబ్బంది టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా కొందరు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది టీ షర్టులు,జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు వస్తున్నారని, ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందంటూ ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అంతా యూనిఫాం లేదా ఫార్మల్ దుస్తులు ధరించే విధులకు హాజరు కావాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
ఎన్నికల వేళ 2 వేల ప్రత్యేక బస్సులు
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అటు ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు ఏపీకి పెద్ద సంఖ్యలో పయనం అవుతున్నారు. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో రాకపోకలు సాగించేందుకు 450 ఆర్టీసీ బస్సులో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తి అయినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇక ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ సంస్థ 2 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది.హైదరాబాద్ లోని వివిధ రద్దీ ప్రాంతాల నుంచి మొత్తం 2 వేల బస్సులను నడుపుతున్నారు. ఎంజీబీస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 200 ప్రత్యేక బస్సులను నడపనునట్టు అధికారులు తెలిపారు.
సజ్జనార్ పై ఎన్నికల అధికారులకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పై కేంద్ర, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ లో తనకు చెందిన ఓ మాల్ కు సంబంధించి ఇప్పటికే రూ 7.50 కోట్లు చెల్లించామని, అయినా బకాయిలు ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ అధికారులను కావాలనే తన మాల్ కు పంపి ఉద్దేశపూర్వకంగానే తనను బద్నాం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల వేళ తమ పార్టీ ప్రతిష్టను దెబ్బే తీసే కుట్ర చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద టాక్స్ లు వసూల్ చేసి కేంద్రానికి జీఎస్టీ కట్టకుండా సజ్జనార్ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సమయంలోనే వేల కోట్లు దోచుకున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. సజ్జనార్ రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని మండిపడ్డారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా