TGPSC JL Results : టీజీపీఎస్సీ జేఎల్ ఫలితాలు విడుదల, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే
28 July 2024, 12:58 IST
- TGPSC JL Results : తెలంగాణ ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది.
టీజీపీఎస్సీ జేఎల్ ఫలితాలు విడుదల, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే
TGPSC JL Results : తెలంగాణ జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. జేఎల్ రాత పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు మొత్తం 2724 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. జనరల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయగా, పీడబ్ల్యూడీ కోటా కింద 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మొత్తం 1392 జేఎల్ పోస్టుల భర్తీకి 2724 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 11 వరకు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులకు కేటాయించిన తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు.
అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ సూచించిన సర్టిఫికెట్లను వెరిఫికేషన్ కు తీసుకురావాలని అధికారులు తెలిపారు. ఫొటోస్టాట్ కాపీల సెట్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. వివిధ కారణాలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరు కాని అభ్యర్థులకు... సెప్టెంబర్ 12, 13 తేదీలను రిజర్వ్ డేస్ గా ప్రకటించారు. ఈ తేదీల్లో అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్ల అందజేస్తే... వారిని తదుపరి ప్రక్రియ కోసం పరిగణిస్తారు. రిజర్వ్ డేస్ కూడా హాజరు కాని అభ్యర్థులను తదుపరి ప్రక్రియకు అనుమతించరు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు కావాల్సినవి ఇవే
1) చెక్‌లిస్ట్ - టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో సూచించిన విధంగా ఒక సెట్ చెక్ లిస్ట్ సిద్ధం చేసుకోవాలి.
2) జేఎల్ కు అప్లై చేసుకున్న దరఖాస్తు (PDF) (కమిషన్ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు)-02 కాపీలు
3) హాల్ టికెట్
4) పుట్టిన తేదీ సర్టిఫికెట్ (SSC మెమో)
5) 1 నుంచి 7వ తరగతి వరకు స్కూల్ స్టడీ సర్టిఫికెట్ లేదా నేటివిటీ, రెసిడెన్స్ సర్టిఫికెట్(ప్రైవేట్‌గా లేదా ఓపెన్ స్కూల్‌లో చదివినవారు)
6) కన్సాలిడేటెడ్‌తో పాటు తాత్కాలిక/కాన్వొకేషన్ సర్టిఫికేట్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ (CMM) , అన్ని మార్కుల మెమోలు
(గ్రాడ్యుయేషన్/మాస్టర్స్)
7) తండ్రి/తల్లి పేరుతో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్
8) BC కమ్యూనిటీ అభ్యర్థుల కోసం నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్(కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది)
9) నోటిఫికేషన్ కు ఏడాది ముందు ఆర్థిక సంవత్సరానికి EWS సర్టిఫికేట్
10) తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన వయస్సు సడలింపు కోసం రుజువు కోసం సర్టిఫికెట్లు
11) సర్వీసులో ఉన్న అభ్యర్థులకు యజమాని నుంచి NOC
12) గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రాలు 2 సెట్లు
13) 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి టీఎజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 డిసెంబరు 16 నుంచి జనవరి 6, 2023 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. 2023 సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల జేఎల్ మెరిట్ జాబితాను విడుదల చేయగా, తాజాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితాను విడుదల చేశారు.