TG Group 2, 3 Exams : తెలంగాణ గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా ప్రచారం, టీజీపీఎస్సీ క్లారిటీ
TG Group 2, 3 Exams : తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా పడ్డాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. పరీక్షలు వాయిదా పడలేదని స్పష్టం చేసింది.
TG Group 2, 3 Exams : తెలంగాణలో పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా వేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో గ్రూప్-2, 3 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, పరీక్షలు వాయిదా వేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేశారనే ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మొద్దని కోరింది. పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు సరైన సమయం లేదని పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడంలేదు. పరీక్షల వాయిదా కుదరదని స్పష్టం చేస్తుంది. వాయిదా వేస్తే ప్రభుత్వానికే లాభమని, అయినా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించేందుకే సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
డీఎస్సీ వాయిదాపై క్లారిటీ
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని గత కొన్ని రోజులు తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అయితే డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయలేమని, షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే డీఎస్సీ వాయిదా వేసే వరకు ఆందోళన విరమించమని నిరుద్యోగులు పట్టుబడుతున్నారు. అయితే ఈ ఆందోళన వెనక కోచింగ్ సెంటర్ల కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వ్యాపార ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లు, రాజకీయ ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు పోటీ పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు
మొత్తం 783 పోస్టులతో టీజీపీఎస్సీ 2023 లో గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2023 ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని గతంలోనే కమిషన్ తెలిపింది.
తొలుత 2023 ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది కమిషన్. గతేడాది నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది టీజీపీఎస్సీ. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఇందులో భాగంగా 2024 ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ప్రకటన చేసింది.
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని 1388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-3 రివైజ్డ్ నోటిఫికేషన్ మే 3న విడుదల చేశారు. గ్రూప్-3 రాత పరీక్షలు ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం