TG Rythu Bharosa : కౌలు రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ సీజన్ నుంచే రైతు భరోసా అందించే యోచన!
27 June 2024, 17:47 IST
- TG Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వానాకాలం నుంచే కౌలు రైతులకు రైతు భరోసా అందించాలని భావిస్తోంది. కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కౌలు రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ సీజన్ నుంచే రైతు భరోసా అందించే యోచన!
TG Rythu Bharosa : కౌలు రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సీజన్ నుంచి కౌలు రైతులకు రైతు భరోసా అందించేందుకు కసరత్తు చేస్తుంది. రైతులతో పాటు కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అందించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ హామీ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వానాకాలం నుంచి కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. వారిని గుర్తించేందుకు కౌలు రైతుల చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.
కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు?
2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కౌలు రైతులు రుణాలు పొందేందుకు రుణ అర్హత కార్డు కోసం ఒక ఫార్మాట్ అమలుచేశారు. యాజమాని కౌలుదారుకు ఇచ్చిన భూమి విస్తీర్ణంపై చేసుకున్న ఒప్పందంపై కౌలుదారు, యజమాని సంతకం చేయాలి. ఆ ఒప్పందానికి గ్రామ సభ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత కౌలు రైతులు రుణ అర్హత కార్డు పొందేవారు. ఈ తరహా ఫార్మాట్ ను కౌలురైతు భరోసాకు అమలు చేస్తారా? మరో పద్ధతిని తీసుకొస్తారా? తెలియాల్సి ఉంది. సాధారణంగా గ్రామాల్లో నోటి మాట ప్రకారమే యజమానులు కౌలుకు ఇస్తున్నారు. యజమాని, కౌలుదారుడికి మధ్య ఎలాంటి ఒప్పంద పత్రాలు, సంతకాలు ఉండడంలేదు. కౌలు రైతులు ఒప్పందం కోసం పట్టుబడితే మరొకరికి కౌలుకు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. రైతు భరోసా విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. జులై 15లోపు ఈ సబ్ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఎన్ని ఎకరాలలోపు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, కౌలు రైతులకు రైతు భరోసా అంశాలపై సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది.
రైతు రుణమాఫీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రుణమాఫీ కటాఫ్ తేదీని కూడా నిర్ణయించారు. తాజాగా రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆగస్టు కన్నా ముందే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే రైతు భరోసాపై ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందిస్తామని, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామన్నారు. గురువారం కొత్తగూడెంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రూ.42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారని మండిపడ్డారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. గత పదేళ్లుగా రాష్ట్ర సంపదను దోపిడీ చేశారన్నారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి పారిపోయారన్నారు. రాష్ట్ర ప్రజల డబ్బుకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందన్నారు. ప్రణాళికా బద్ధంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందిస్తామన్నారు. రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచుతామన్నారు.