Telangana Cabinet Decisions : రూ. 2 లక్షల రుణమాఫీ - గైడ్ లైన్స్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన, ఆ తర్వాతే 'రైతుభరోసా' అమలు-telangana cabinet has approved several key decisions complete list check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cabinet Decisions : రూ. 2 లక్షల రుణమాఫీ - గైడ్ లైన్స్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన, ఆ తర్వాతే 'రైతుభరోసా' అమలు

Telangana Cabinet Decisions : రూ. 2 లక్షల రుణమాఫీ - గైడ్ లైన్స్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన, ఆ తర్వాతే 'రైతుభరోసా' అమలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 21, 2024 07:21 PM IST

Telangana Cabinet Decisions : తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందుకు సంబంధించిన నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ కేబినెట్
తెలంగాణ కేబినెట్

Telangana Cabinet Decisions : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ భేటీ అయింది. ఇందులో రుణమాఫీతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. వీటిలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు.

yearly horoscope entry point

వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ ఆధారంగా…. రుణమాఫీపై నిర్ణయం తీసుకోవటం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీని చేస్తున్నట్లు తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం… పదేళ్ల కాలంలో రుణమాఫీ కింద రూ. 28వేల కోట్లు మాత్రమే చెల్లించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. డిసెంబర్  12, 2018 నుంచి డిసెంబర్ 09, 2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ప్రకటించారు. రూ. 2 లక్షల లోపు ఉన్న రుణాలు ఉన్నవారు అర్హులు అవుతారని చెప్పారు. ఇందుకోసం రూ. 31వేల కోట్ల అవసరమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నిధులను సేకరించి…రుణమాఫీ చేసి వ్యవసాయం దండగ కాదు పండగ అన్నట్లు చేస్తామని వెల్లడించారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. విడతలవారీగా చేస్తామంటూ గత ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్లిందని విమర్శించారు. కానీ మా ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం…అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అమలు చేస్తున్నామని తెలిపారు.

రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు, అర్హుతల వివరాలకు సంబంధించిన జీవోను త్వరలోనే విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాము నిర్ణయించుకున్న ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఏమైనా వివరాలు కావాలంటే ఆర్థికమంత్రి నుంచి తీసుకోవచ్చని సూచించారు.

రైతుభరోసాపై ఏమన్నారంటే…?

రైతుభరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంట పెట్టుబడి సాయంపై రకరకాలపై చర్చలు జరుగుతున్నాయని… కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. పారదర్శకంగా రైతుభరోసాను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. రైతుభరోసా అమలుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. దీనికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వం వహిస్తారని వెల్లడించారు. 

రైతుభరోసా విధివిధానాల ఖరారుపై రైతులతో పాటు సంబంధిత సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం… అందరితో చర్చిస్తుందని పేర్కొన్నారు. జూలై 15వ తేదీలోపు నివేదిక వస్తుందని, ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రైతుభరోసా స్కీమ్ ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. జవాబుదారీతనంతో తమ సర్కార్ పని చేస్తుందన్నారు.

ప్రభుత్వం తరపున తీసుకునే నిర్ణయాలను మీడియాకు వెల్లడించేందుకు ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారని రేవంత్ రెడ్డి చెప్పారు. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చే సమాచారమే అధికారికంగా ఉంటుందన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. మంత్రుల నుంచి సమాచారం తీసుకోవచ్చని… ఎలాంటి వివరణ అయినా కోరవచ్చని సూచించారు. ప్రభుత్వానికి సంబంధం లేని ఏ విషయాలైనా పార్టీలోని నేతలు మాట్లాడుతారని వ్యాఖ్యానించారు.

 

 

Whats_app_banner