Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికలపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్,బీజేపీ- సైలెంట్ మోడ్ లోనే గులాబీ పార్టీ
27 March 2024, 11:26 IST
- Lok Sabha Elections : లోక్ సభ ఎన్నిక అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్, బీజేపీ కసర్తు చేస్తున్నాయి. ఆశావహుల లిస్ట్ లతో సహా స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ టికెట్ ఖరారుపై చర్చిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికలు
Lok Sabha Elections : త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections)అభ్యర్థుల విషయంలో పార్టీలు కసరత్తు వేగవంతం చేశాయి. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి వివిధ దశలో నివేదికలను తప్పించుకున్న పార్టీ పెద్దలు......తుది జాబితా ఖరారుపై దృష్టి సారించారు. లోక్ సభ అభ్యర్థుల జాబితాపై ఏర్పడిన ఉత్కంఠకు తెరదించేందుకు కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) జోరును పెంచాయి. నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ హైదరాబాద్ కు వస్తుండగా....మరోవైపు దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నివాసంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ నేతలు సైతం హాజరు కానుండగా..... అభ్యర్థుల విషయంలో ఎలాంటి ప్రకటనలు రాబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.
నాగర్ కర్నూలు నాకే కావాలి : మల్లు రవి
హైదరాబాద్ కు వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ లోక్ సభ టికెట్లు, నామినేటెడ్ పదవులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు ఇతర నాయకులతో సమావేశమై అభ్యర్థుల జాబితాపై చర్చించినట్లు సమాచారం. కాగా ఇటీవలే కొడంగల్ లో పర్యటించిన రేవంత్....కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డిని మహబూబ్ నాగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు నాగర్ కర్నూల్ టికెట్ తనకే కావాలని మల్లు రవి పట్టుపట్టారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిథి పదవికి శుక్రవారం దిల్లీలో రాజీనామా చేశారు. దీంతో పార్టీలో ఒక్కసారిగా టికెట్ల కోసం పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మిగిలిన స్థానాల్లో కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ఒకవైపు పార్టీలో కొత్త నేతల చేరికలు, మరోవైపు సీనియర్ నాయకుల ఆశలు మధ్య పార్టీ ఏటు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.
దిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం
మరోవైపు ఇవాళ హస్తినలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ,ఈటల రాజేందర్ సహా ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. మరికొన్ని నెలల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నేతలు చర్చించనున్నారు. టికెట్ల కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర నేతలకు అధిష్టానం ఎలాంటి దిశా నిర్దేశం చేయబోతున్నదనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ తర్వాత రాష్ట్రంలో సగం లోక్ సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పార్టీ బలంగా ఉన్న చోట, ఇబ్బందులు లేని నియోజికవర్గాల్లో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయడం ఉత్తమమని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారట. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లలో మూడింట్లో (ఆదిలాబాద్ మినహా) సిట్టింగ్ ఎంపీలనే బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం హై కమండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి ఆశావహులకు సంబంధించి ముగ్గురు పేర్లతో కూడిన ఒక జాబితా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని కుదిరితే ఇవాళ లేదంటే మార్చి రెండో వారంలో అభ్యర్థులను అనౌన్స్ చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రమైన పోటీ ఉన్న మల్కాజిగిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న అంశం. దీంతో ఈసారి టికెట్ల విషయంలో ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేది రాజకీయ వర్గాల్లో ఇంటరెస్టింగ్ గా మారింది.
మౌనంలో గులాబీ బాస్
ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కసరత్తు వేగవంతం చేస్తుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఎటువంటి హడావుడి చేయడం లేదు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్....లోక్ సభ ఎన్నికల పై వ్యూహాలు రచిస్తున్నారు అనే సమాచారమే తప్ప ఎటువంటి కార్యచరణ కనిపించడం లేదు. ఒకవైపు పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు పక్క పార్టీల వైపు చూస్తున్నా, నేతలు చేజారుతున్నా కేసీఆర్ మాత్రం కూల్ గా ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం పార్టీకి తీవ్రంగా డ్యామేజ్ చేసిందనే వాదనలు ఉన్న నేపథ్యంలో.....ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారట. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తరువాతే తాను ప్రకటించే ఆలోచనలో ఉన్నారట.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా