CM Revanth Reddy : గత సర్కార్ నిర్ణయాలను కొనసాగిస్తాం...! హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు-cm revanth inaugurated state disaster response state headquarters building in nanakramguda in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : గత సర్కార్ నిర్ణయాలను కొనసాగిస్తాం...! హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy : గత సర్కార్ నిర్ణయాలను కొనసాగిస్తాం...! హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy Latest News: హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లలో హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందని చెప్పుకొచ్చారు. గత సర్కార్ తీసుకున్న నిర్ణయాలను కూడా కొనసాగిస్తామని.. అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CMO Telangana)

CM Revanth Reddy About Hyderabad Development: నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ప్రమాదం జరిగినపుడు అందరికంటే ముందుండేది ఫైర్ డిపార్ట్ మెంట్ అని, ప్రజల రక్షణ కోసం ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతారని కొనియాడారు. ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందని… నగరంలో శాంతి భద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్న ముఖ్యమంత్రి… గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే, మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తాం. త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకు రాబోతున్నాం. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతాం. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 25వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. మెట్రో రద్దు కాలేదు, ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నాం. ఫార్మా సిటీలు కాదు. ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తాం. అపోహలు వద్దు. మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది. మాకు మేమే మేధావులమని భావించం. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతాం. గతంలో సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ, భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకెళతాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు.ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాద్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామన్నారు. అధికారుల నియామకంలో కూడా అన్ని ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటున్నామని చెప్పారు. పారదర్శకంగా ఉండే అధికారులనే నియమిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ లోని బిల్డర్లకు పూర్తి స్థాయిలో సాకారం అందిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.

కొన్ని నిర్ణయాలను తీసుకునేందుకు ఆలస్యం అవుతుందని… ఇందుకు కూడా కారణాలు ఉన్నాయని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్నింటిపై కసరత్తు చేసే నిర్ణయాలను ప్రకటిస్తామని.. ఇందుకోసం కొంత సమయం తీసుకుంటామని అన్నారు. అధికారులను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని… ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారిస్తామని వెల్లడించారు. డిపార్టుమెంట్లలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు. పోలీస్ శాఖలో ఉన్న వసతులన్నింటిని… ఫైర్ శాఖలో ఉన్న వారికి కూడా వర్తింపజేస్తామని పేర్కొన్నారు.