Smita Sabharwal : దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు- స్పందించిన మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క
23 July 2024, 18:08 IST
- Smita Sabharwal : దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఆమెపై దివ్యాంగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క స్పందించారు.
దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు- స్పందించిన మంత్రులు
Smita Sabharwal : సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్వాంగులపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే దివ్యాంగులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క స్పందించారు. స్మితా సబర్వాల్ దివ్యాంగులపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమన్నారు. వీటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏ విషయమైనా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తామన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సామాజిక మాధ్యమాల వేదికగా దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. స్మితా సబర్వాల్ ప్యూడల్ భావజాలాన్ని కలిగి ఉన్నారన్నారు. ఆమె తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని హితవుపలికాలు. మానసిక వైకల్యం ఉన్నవారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయని కాస్త ఘాటుగా స్పందించారు.
అసలేంటీ వివాదం?
ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా అవసరమా? అని తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. ఐపీఎస్, డిఫెన్స్ సహా పలు సర్వీసుల్లో దివ్వాంగు కోటా ఎందుకు లేదని ప్రశ్నించాలన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఐఏఎస్ కోచింగ్ అకాడమీ నిర్వాహకులు బాలలత మండిపడ్డారు. స్మితా సబర్వాల్ ఏ అధికారంతో ఆ వ్యాఖ్యలు చేశారో సమాధానం చెప్పారు. తనలాంటి వైకల్యంతో బాధపడే ఎంతో మందిని స్మితా వ్యాఖ్యలు బాధించాయని ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎప్పుడో 165 ర్యాంక్ సాధించి, ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. ఇప్పుడు తనతో పోటీ పడి మళ్లీ పరీక్ష రాయాలని స్మితా సబర్వాల్ కు సవాల్ విసిరారు. అంధులైన తన విధ్యార్థులతో స్మితా పోటీ పడాలని బాలలత డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎలా మాట్లాడారని, గుర్తింపు కోసం కొందరు సివిల్ సర్వెంట్స్ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగుల మీద, సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతాయని, వివక్షకు గురయ్యే దివ్యాంగులను అవమానించేలా, వారిని దూరం పెట్టాలని స్మితా చెప్పారన్నారు.
బాల లత సవాల్ కు ఓకే
బాల లత వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ ఎక్స్ లో స్పందించారు. తాను బాల లత విచిత్రమైన సవాల్ ను స్వీకరిస్తానన్నారు. అయితే నా వయస్సు పెరిగిన కారణంగా యూపీఎస్సీ అనుమతిస్తుందో లేదో అనే సందేహం ఉందని వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. వికలాంగుల కోటాలో బాల లత తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగించారో చెప్పాలని ప్రశ్నించారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నడపడానికా లేదా ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకా? అని ప్రశ్నించారు.